Cyclone Freddy in Malawi: మలావీలో ఫ్రెడ్డీ భీభత్సం… 100 మందికి పైగా మృతి
Cyclone Freddy in Malawi: ఆఫ్రికాలోని మలావీ దేశంలో ఫ్రెడ్డీ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఈ తుఫాను ఆ దేశంపై విరుచుకుపడటంతో ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలల కారణంగా వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగిపోవడంతో ఆ వరదల్లో వందలాది మంది చిక్కుకున్నారు. ఈ తుఫాను ధాటికి ఇప్పటికే వంద మందికి పైగా మృతి చెందినట్లు మలావీ అధికారులు తెలియజేశారు. ఇప్పటికే 60 కి పైగా మృతదేహాలను గుర్తించారు. నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజలు ఆ వరదలో చిక్కుకుపోయారు. ఈ తుఫాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
భారీగా ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు తుఫానులు ఏర్పడటంతో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మలావీ అధికారులు చెబుతున్నారు. వరద తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లు మట్టితో నిర్మించినవి కావడంతో వేలసంఖ్యలో ఇళ్లు వరదలో కొట్టుకుపోతున్నాయి.