Common Man Facing Huge Troubles in Pakistan: పాక్‌లో దుర్భర స్థితులు…ఒక్కపూటకే నానా తంటాలు
Common Man Facing Huge Troubles in Pakistan: పాకిస్తాన్‌లో రోజు రోజుకు పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. వరదలతో అల్లాడిన ప్రజల నెత్తిన ద్రవ్యోల్భణం, ఆర్థిక మాంద్యం పిడుగు పడటంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని తాకాయి. పంటమొత్తం వరద పాలైంది. ఆహారం దొరక్క ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గోధుమ పిండి ధరలు ఆకాశాన్ని తాకింది. ప్రభుత్వం అందించే గోధుమ పిండికోసం రోజుల తరబడి ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్ ధరలు సైతం ఆకాశాన్ని తాకడంతో ప్రజలు ప్రయాణాలు చేయడం మానేశారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక బడికి పంపలేకపోతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఒకప్పుడు మూడు పూటల వండుకొని తినేవాళ్లమని, కాని, ఇప్పుడు ఒకపూట వండుకొని తినడానికే ఇబ్బందులు పడుతున్నట్లు పాక్ ప్రజలు వాపోతున్నారు. ఒక్కపూట వండుకొని మూడు పూటలా దానినే సరిపెట్టుకోవలసి వస్తోందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు బాగున్న రోజుల్లో ఇళ్లల్లో పనిచేసి 15 నుండి 20 వేల వరకు సంపాదించుకునే వ్యక్తులు ఇప్పుడు మూడు నాలుగు వేలు మాత్రమే సంపాదన వస్తోందని, ఈ సంపాదన దేనికి సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, కానీ, సంపాదన మాత్రం పెరగడంలేదని ప్రజలు వాపోతున్నారు. ద్రవ్యోల్భణం కారణంగా వ్యాపారం దెబ్బతినిందని, నెలకు రూ. 50 వేల వరకు పెట్టుబడులు పెట్టేవారమని, కానీ, ఇప్పుడు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆకలి చావులు తప్పవని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
పాక్ ఆర్థిక పరిస్థితులు అత్యంత దుర్లభంగా మారిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పాక్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో ఎఫ్ఏటీఎఫ్ సంస్థ చాలా కాలం పాటు పాక్‌ను గ్రే లిస్టులో పెట్టింది. ఇటీవలే ఆ లిస్ట్ నుండి తొలగించినప్పటికీ రుణ సంస్థలు ఆ దేశానికి రుణాలు ఇచ్చేందుకు తటపటాయిస్తున్నాయి. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో విదేశాల నుండి దిగుమతులు తగ్గిపోయాయి. విదేశాల నుండి ఎక్కువ భాగం పాక్ నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. వీటికి చెల్లించేందుకు కూడా మారక నిల్వలు లేకపోవడంతో ధరలు భారీగా పెరిగిపోయాయి.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న వేళ పాక్ తన ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. అమెరికా వంటి దేశాల మెప్పుకోసం పాక్ ఈ పనిచేసింది. అప్పటి నుండి పాక్‌కు రష్యాకు మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో భారత్ రష్యా నుండి చౌకగా ఆయిల్‌ను కొనుగోలు చేయడంతో ఆ దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవనే సంకేతాలు రావడంతో పాక్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.
మిత్రదేశాల నుండి రుణాల పొందడం కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని పాక్ ప్రయత్నాలు చేసింది. ఫలితం లేకపోవడంతో పాకిస్తాన్ చివరకు మరోసారి ఐఎంఎఫ్ ను సంప్రదించింది. ఆ సంస్థ అనేక కండీసన్లు పెట్టింది. ఆ కండీషన్లకు పాక్ ఒప్పుకోవడంతో నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పాక్ మిత్రపక్షం కూడా కొద్దిపాటి సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, పాకిస్తాన్ ఆహార సంక్షోభం నుండి బయటపడాలి అంటే ఆ దేశానికి భారీ సహాయం అవసరం అవుతుంది. ఆ స్థాయిలో సహాయం చేసే దేశాల కోసం పాక్ అన్వేషిస్తున్నది. అయితే, అప్పటి వరకు ప్రజలు ఆకలితో అలమటించాల్సిందేనా? ఇప్పటికే ఆ దేశంలో ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. మరికొన్నిరోజులు ఇదేవిధంగా ఉంటే పాక్‌లో ప్రజా ఉద్యమం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.