New Zealand New PM: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్
Chris Hipkins sworn in as New Zealand PM: న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టారు. జసిండా అర్డెర్న్ గతవారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలను ఆమె వివరించలేదు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తన వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేసినట్లు జసిందా ఆర్డర్న్ తెలియజేశారు. వచ్చే నెలలో రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ ఆమె ముందుగానే పదవీబాధ్యతల నుండి తప్పుకున్నారు. జసిండా రాజీనామా చేసిన తరువాత 41వ ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ బాధ్యతలు చేపట్టారు.
తనముందు అనేక సవాళ్లు ఉన్నాయని, ముందుగా ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి పునర్వైభవం తేవడమే తన లక్ష్యమని హిప్‌కిన్స్ పేర్కొన్నారు. కరోనా సమయంలో న్యూజిలాండ్ దేశం తీసుకున్న కఠినమైన నిర్ణయాల వలన ఆ దేశం కరోనా నుండి బయటపడగలిగింది. అయితే, కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఆదేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది. కాగా, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి కొద్ది కొద్దిగా బయటపడుతున్నది. మరో తొమ్మిది నెలల్లో న్యూజిలాండ్ పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రధాన మంత్రి మార్పు జరగడం విశేషం. వచ్చే ఎన్నికల్లోనూ అధికార లేబర్ పార్టీ కూటమి విజయం సాధిస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.