China: చైనాలో తగ్గుతున్న జననాలు, పెరుగుతున్న మరణాలు, దేనికి సంకేతం?
China Population is declining for the last two years
చైనాలో జనాభా లెక్కలు తలక్రిందులవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరోనా విలయతాండం చేయడంతో గత ఏడాది అత్యధిక మరణాలు సంభవించాయి. జననాలు తగ్గాయి. మరణాలు పెరిగాయి. చైనాలో జననాల సంఖ్య గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఉందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ గణాంకాలు వెల్లడించింది. చైనాలో కరోనా కారణంగా గత ఏడాది డిసెంబర్ 22 నుంచి ఈ ఏడాది జనవరి 12 వరకు 60 వేల మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
2022లో చైనాలో 9.56 మిలియన్ల మంది జన్మించగా, 10.41 మిలియన్ల మరణాలు సంభవించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనాలో జననాల సంఖ్య 2021లో 13 శాతం తగ్గిపోగా, 2022లో 22 శాతం తగ్గిపోయాయి. 1960లో ఒకసారి చైనాలో జననాలలో తగ్గుదల కనిపించింది. ఆ తర్వాత గత రెండేళ్లుగా అవే పరిణామాలు పునరావృతం అవుతున్నాయి. గత ఏడాదిలో జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్యే ఎక్కువుగా ఉన్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు.
చైనాలో క్రమ క్రమంగా ముసలి వయస్కుల సంఖ్య పెరుగుతోందని, పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గుతోందని కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు చైనా ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.