China: శృతిమించుతున్న డ్రాగన్..అక్సాయ్ చిన్ మీదుగా అక్రమ నిర్మాణం
China Border: సరిహద్దు దేశాల్లో చైనా ఆగడాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పటికే తూర్పు లడఖ్.. తదితర ప్రాంతాల్లో చైనా ఆగడాలు శృతి మించడంతో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇప్పటికే.. పాంగాంగ్ సరస్సుపై వంతెన నిర్మించిన చైనా.. తాజాగా మరో వంతెన నిర్మాణం చేపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్సాయ్ చిన్ మీదుగా భారత్ సరిహద్దుల వెంట నడిచి కలుపుతూ మరో రహదారిని నిర్మించాలని చైనా యోచిస్తోంది. చైనా కొత్తగా విడుదల చేసిన హైవే ప్లాన్ ప్రకారం, భారతదేశ సరిహద్దు వెంబడి జింజియాంగ్‌ను టిబెట్‌తో కలుపుతూ ఈ రహదారిని నిర్మించాలని యోచిస్తోంది. వాస్తవాధీన రేఖకు ఉత్తరం వైపు జీ695 ను నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.ఈ రహదారి నిర్మాణాన్ని 2035 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని పై హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న ‘మార్నింగ్ పోస్ట్’ కథనాన్ని ప్రచురించింది.
మరో వైపు భారత్‌ను భయపెట్టేందుకు చైనా అన్ని రకాల అస్త్రాలను వాడుకుంటోంది. గ్రే జోన్ ఆపరేషన్లను దూకుడు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే భారత సరిహద్దుల్లో చైనా యుద్ధవిమానాల చక్కర్లు కొడుతున్నాయ్. భారత్ సరిహద్దుల్లో మోహరించాలని భావిస్తున్న అత్యాధునిక రాకెట్ వ్యస్థలను చైనా పరీక్షించింది. పీసీఎల్ 191 వ్యవస్థగా పిలిచే రాకెట్‌ను పశ్చిమ థియేటర్ కమాండ్‌లోని షింజియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ ఇప్పటికే వాడుతోంది.
2017లో భారత్,చైనా దళాలు ముఖాముఖి తలపడిన డోక్లాం సమీపంలోని అమోచూ వద్ద చైనా ఓ గ్రామాన్ని నిర్మించింది. దీనికి పాంగ్డా అని పేరు పెట్టి ప్రజలను అక్కడికి తరలించింది. ఇది పూర్తిగా భూటాన్ భూభాగంలో నిర్మించింది. ఇక్కడ నిర్మించిన ఇళ్లల్లో ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు సంస్థ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. కార్లతో ఇక్కడి పార్కింగ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేరకు భూటాన్ భూభాగాన్ని చైనా మింగేసింది. అమోచూ సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమి శిఖరాలపైకి చేరుకోవడం తేలిక. ఒక వేళ చైనా సైన్యం ఇక్కడకు వస్తే భారత్‌లోని సిలుగుడి కారిడార్ డ్రాగన్ గురిలోకి నేరుగా వస్తుంది. ఈ కారిడార్ భద్రతా పరంగా భారత్‌కు అత్యంత సున్నితమైంది.