Building Explosion in Bangladesh: బంగ్లా రాజధానిలో భారీ పేలుడు… 17 మంది మృతి
Building Explosion in Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఏడు అంతస్తుల భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ పేలుళ్లలో 17 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. శిధిలాల క్రింద మరికొంత మంది ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో శిథిలాలను తొలగిస్తేనే మృతుల సంఖ్య ఏ మేరకు ఉంటుందనేది తెలుస్తుందని, అప్పటి వరకు అంచనాకు రాలేమని అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ ఏడు అంతస్తుల భవనం క్రింది అంతస్తుల్లో శానిటరీ ఉత్పత్తుల కార్యాలయం ఉందని, ఈ బిల్డింగ్‌లో నిల్వ ఉంచిన రసాయనాల కారణంగానే పేలుళ్లు సంభవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దర్యాప్తు తరువాతే పూర్తి విషయాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ బిల్డింగ్ ప్రక్కనే బీఆర్ఏసీ బ్యాంక్ కూడా ఉన్నది. ఈ పేలుళ్ల ధాటికి బ్యాంకు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా, రోడ్డుపై ఉన్న ఓ బస్సు కూడా ధ్వంసం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపడుతున్నాయి.