డ్యూటీలో ఉన్న లేడీ రిపోర్టర్ ను కాల్చిచంపిన సైన్యం
ఇజ్రాయిల్ తూర్పు సరిహద్దు ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్ లో ఘోరం జరిగింది. ఫేమస్ లేడీ రిపోర్టర్ షిరీన్ అబు అక్లేహ్ ని ఇజ్రాయిల్ సైన్యం కాల్చిచంపింది. డ్యూటీలో ఉండగానే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రముఖ టీవీ ఛానల్ అల్ జజీరాకు చెందిన షిరీన్.. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సైనిక దాడిని, జెనిన్ శరణార్థుల శిబిరంలోని అశాంతిని రిపోర్ట్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. షిరీన్ మరణాన్ని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. అయితే.. ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ కొత్త వాదనను తెర మీదికి తెచ్చారు. పాలస్తీనీయుల కాల్పుల్లోనే ఆమె చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జెనిన్ శిబిరంలో తమ సైన్యం ఆపరేషన్ నిర్వహించిన మాట వాస్తవమేనని, రిపోర్టర్ ను తాము ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయలేదని ఆర్మీ పేర్కొంది. అనుమానితులకు, తమ భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయని, పాలస్తీనా గన్ మెన్లే ఆమెను చంపి ఉంటారని ఆరోపించింది. ఈ ఘటనలో అల్ జజీరా ఛానల్ ఫొటోగ్రాఫర్ కూడా గాయపడ్డాడు. ఆయన మాత్రం ఇజ్రాయిల్ మిలటరీదే ఈ పాపమని స్పష్టం చేశారు. కాల్పుల సమయంలో పాలస్తీనావాళ్లు ఎవరూ అక్కడలేరని అన్నారు. ఇజ్రాయిలే తమ రిపోర్టర్ మరణానికి బాధ్యత వహించాలని, ఈ హత్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాలని అల్ జజీరా ఛానల్ పిలుపునిచ్చింది.