Aircraft crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం.. 40 మంది మృతి?
Aircraft crash at Pokhara Airport : నేపాల్ రాజధాని ఖాట్‌మండు నుంచి పోఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం ఆదివారం ఉదయం కస్కీ జిల్లాలోని పోఖారాలో కూలి పోయిన ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనపై ఏటీ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా మాట్లాడుతూ కుప్పకూలిన విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చెప్పారు. మొత్తం 72 మంది చనిపోయారని అంటున్నా ఇప్పటి వరకు 40 మంది మృతిని ధృవీకరించారు. ప్రమాదం తర్వాత విమానాశ్రయం ప్రస్తుతం మూసివేయబడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 సిబ్బందితో సహా మొత్తం 72 మంది ప్రయాణికులు మరణించారని, వారి మృతదేహాలను వెలికితీసే పనిలో ఉన్నారని అంటున్నారు.
ఇక వీరిలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు. ఇందులో ఇద్దరు పిల్లలు సహా 15 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకారం, విమానంలో 53 మంది నేపాలీలు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఒక్కొక్కరు ఐరిష్, అర్జెంటీనా మరియు ఫ్రెంచ్ పౌరులు ఉన్నారు. నేపాల్ విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 36 మృతదేహాలను వెలికి తీశారని చెబుతున్నారు. నేపాల్ ప్రధాన మంత్రి తక్షణ రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను చేపట్టాలని హోం మంత్రిత్వ శాఖ, భద్రతా సిబ్బంది అలాగే అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. ప్రమాదాన్ని పరిశీలించేందుకు ప్రధాని దహల్ ఖాట్మండు విమానాశ్రయానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు. పోఖారా విమానాశ్రయంలో ప్రయాణీకుల విమాన ప్రమాదం తర్వాత, నేపాల్ ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.