Abdul Makki: అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి
Abdul Makki: ముంబై దాడి సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ బావ అయిన అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భద్రతా మండలి అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చినట్లు తెలిపింది. జమ్ము కాశ్మీర్‌లో నిధుల సేకరణ, యువతను మభ్యపెట్టి ఉగ్రవాదంలోకి వచ్చేలా చేయడం వారిని హింసలో భాగస్వామ్యులను చేయడం, పలు దేశాలపై దాడులకు కుట్ర పన్నడంతో దేశీయ చట్టాల ప్రకారం మక్కీని కరుడు గట్టిన ఉగ్రవాది జాబితాలో భారత్ చేర్చింది.
మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చాలని గతేడాది జూన్‌లో భారత్ యుఎన్‌ఎస్‌సిలో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ‘నో ఆబ్జక్షన్ విధానం’ కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా హోల్డ్‌లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం.. దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో చివరకు యుఎన్‌ఎస్‌సీ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
లష్కరే తొయిబాలో వివిధ నాయకత్వ పదవులను నిర్వహించాడుమక్కీ .. అలాగే లష్కరే తొయిబా కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారు. 2020లో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మక్కీని ఉగ్రవాదానికి నిధులు సేకరణ కేసులో నిందితునిగా నిర్థారించడంతో పాటు ఏడాది పాటు జైలుశిక్ష విధించింది. అదే సమయంలో, భారత్ ఆరోపణ నిజమని ప్రపంచం ఇప్పుడు అంగీకరించవలసి వచ్చింది. అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం భారత్‌కు లభించిన పెద్ద విజయంగా పేర్కొనాలి. 2000లో ఢిల్లీలోని ఎర్రకోటపై, 2008లో రాంపూర్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో అబ్దుల్ హస్తం ఉంది.