Amazon: అమెజాన్‌లో 20 వేల మంది ఉద్యోగుల తొలగింపు
Amazon: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఇటీవల 10 వేల మందిని తొలగింవచ్చనే నివేదికలు రాగా, ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే లేఆఫ్‌లు ఉంటాయని తెలుస్తోంది. నివేదికల ప్రకారం, అమెజాన్ రాబోయే కొద్ది నెలల్లో 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను నియమించుకున్న అమెజాన్ సంస్థ … ఇప్పుడు తొలగింపునకు సిద్ధమైంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గ్రేడ్ 1 నుండి 7 వరకు అన్ని ర్యాంకుల ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండనుందని ‘కంప్యూటర్ వరల్డ్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది.
పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లకు సంస్థ ఇప్పటికే సూచనలు చేస్తున్నట్లు సమాచారం. 20 వేల మంది ఉద్యోగులను తొలగింపు అంటే ప్రపంచవ్యాప్తంగా కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి 1.5 మిలియన్ల ఉద్యోగులు ఉన్న అమెజాన్‌లో ఈ సంఖ్య 1.3 శాతంతో సమానం. తొలగించనున్న ఉద్యోగులకు 24 గంటల ముందు నోటీసు అందించడంతో పాటు పరిహార ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 20 వేలమందినీ తొలగిస్తే అమెజాన్ చరిత్రలో ఇదే అతిపెద్ద మొదటి తొలగింపు కానుంది. ఫలానా డిపార్ట్మెంట్, ఫలానా ఏరియా అని కాకుండా అన్ని చోట్లా ఉద్యోగుల తొలగింపు ఉండనుందని అమెజాన్ సిఇఒ ఆండీ జాస్సీ ఉద్యోగులకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి.