Sri Lanka: రాష్ట్రపతి నివాసంలో ఆ వస్తువులు కొట్టేశారు!
1000 Artifacts Missing From Sri Lanka Presidential Palace And PM Official Residence : శ్రీలంకలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు గతంలో తీవ్రరూపం దాల్చాయన్న సంగతి తెలిసిందే. వేలాది మంది నిరసనకారులు రాష్ట్రపతి భవన్లోకి ప్రవేశించారు. ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు చాలా వరకు సద్దుమణిగిన నేపథ్యంలో ఓ షాకింగ్ సమాచారం తెరపైకి వచ్చింది. అదేమిటంటే శ్రీలంకలోని రాష్ట్రపతి భవన్, ప్రధాని అధికారిక నివాసం నుంచి విలువైన వస్తువులతో సహా వెయ్యికి పైగా కళాఖండాలు మాయమయ్యాయి. ఈ మేరకు శనివారం పోలీసులు సమాచారం అందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు జూలై 9న మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నివాసాలను ముట్టడించారు. శ్రీలంకలోని రాష్ట్రపతి భవన్ సహా కొలంబోలోని ‘టెంపుల్ ట్రీ’ వద్ద ఉన్న ప్రధాని అధికారిక నివాసం నుండి అవసరమైన వస్తువులతో సహా వెయ్యికి పైగా విలువైన కళాఖండాలు మాయమైనట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, రాష్ట్రపతి భవన్తో పాటు ప్రధాని అధికారిక నివాసం నుండి కనీసం 1,000 విలువైన వస్తువులు, అరుదైన కళాఖండాలు మాయమైనట్లు పోలీసు వర్గాలను ఉటంకిస్తూ శ్రీలంక వెబ్ పోర్టల్ కొలంబో పేజెస్ నివేదించింది. దర్యాప్తు ప్రారంభించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. మిస్సైన పురాతన వస్తువులకు సంబంధించి కచ్చితమైన, స్పష్టమైన సమాచారం అందడం కష్టమని పురావస్తు శాఖ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం నాడు ‘లంకదీప’ పత్రికకు తెలిపారు. అయితే, మిస్సైన వస్తువుల సంఖ్య 1000కు పైగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
శాంతియుత ప్రదర్శనలకు నిరసనకారుల హక్కును తాను గౌరవిస్తానని, అయితే రాష్ట్రపతి భవన్ లేదా ప్రధాని వ్యక్తిగత నివాసం వంటి మరే ఇతర ప్రభుత్వ భవనాన్ని ఆక్రమించుకోవడానికి నిరసనకారులను అనుమతించబోమని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి దూసుకురాకుండా, పార్లమెంటుకు అంతరాయం కలిగించకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని శ్రీలంక సాయుధ దళాలు అలాగే పోలీసులకు అధికారం ఇచ్చానని విక్రమసింఘే చెప్పారు. ఇక పార్లమెంటేరియన్లు – పార్లమెంటు తమ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా అడ్డుకోవద్దని ఆయన అంతకు ముందు నిరసనకారులను కోరారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో శ్రీలంక భద్రతా దళాలు గాల్ ఫేస్లోని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల స్థావరంపై దాడి చేశాయి. ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ దాడిలో కనీసం తొమ్మిది మంది గాయపడ్డారని అంచనా.