YS Sharmila: కేసీఆర్ సర్కారుపై ఉమ్మడి పోరాటం చేద్దాం, ప్రతిపక్షాలకు షర్మిల లేఖ ..
YS Sharmila wants President Rule in Telangana
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు, రాళ్ల దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటుదని తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాలకు షర్మిల లేఖలు రాశారు. అఖిల పక్షంగా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని పిలుపునిచ్చారు. అధికారపక్ష దాష్టీకాలకు ముగింపు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందు కోసం విపక్షాలు ఒక్కటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని షర్మిల అన్నారు.
షర్మిల యాత్రకు అడుగడుగునా ఆటంకాలు
వైఎస్ షర్మిల తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక నాయకులపై, ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు గులాబీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. షర్మిల యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. షర్మిల యాత్ర కొనసాగకుండా ఆంక్షలు అమలు జరిగేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ప్రతిపక్షాలకు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. అందరం సమిష్టిగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.