Congress – YSRTP: కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటకలో గెలుపు జోష్ తో తెలంగాణలో కాంగ్రెస్ కొత్త అడుగులు వేస్తోంది. వామపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్సార్ ఇమేజ్ ను కూడా తమకే దక్కేలా కాంగ్రెస్ వ్యూహం సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రాజకీయంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ కుమార్తె షర్మిలను కాంగ్రెస్ లోకి రప్పించేందుకు గాలం వేస్తోంది. షర్మిల బెంగుళూరులో డీకే శివకుమార్ తో సమావేశం తరువాత ఈ ప్రచారం మరింత పెరిగింది. సొంత గూటికి రాజన్న కుతురు చేరుతారా.
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు సిద్దం చేస్తోంది. కర్ణాటకలో గెలుపుకు అమలు చేసిన వ్యూహాలను తెలంగాణలో అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ మూలాలు ఉన్న వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్సార్ లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయటమేనని పలుమార్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇప్పడు తెలంగాణలో రాజన్న రాజ్యం పేరుతో షర్మిల చేస్తున్న రాజకీయ యాత్ర కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటం ఉంటుందని షర్మిల గతంలో చెప్పారు. ఒక దశలో బీజేపీ వదిలిని బాణంగా షర్మిల పైన ఆరోపణలు వచ్చాయి. తాను ఎవరు వదిలిన బాణం కాదని షర్మిల సమాధానం ఇచ్చారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆశించిన స్థాయిలో బలం పెంచుకోలేదు. ఒక విధంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ పాలన పైన పోరాటం చేస్తున్నారు. తన తండ్రి పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు సాధించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వైఎస్సార్ ఇమేజ్ మాత్రమే షర్మిల ఆయుధంగా మారింది. వైఎస్సార్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రచారం చేస్తూ షర్మిల పార్టీ ముందుకు వెళ్తోంది. అయినా ఆశించిన ఆదరణ కనిపించటం లేదు.
వైఎస్సార్ ఇమేజ్, రెడ్డి సామాజిక వర్గం ఓట్ల పైన షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పోటీ పడుతోందది. ఈ సమయంలోనే షర్మిల పైన కాంగ్రెస్ నాయకత్వం గురి పెట్టినట్లు కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా వైఎస్సార్ పేరును పలు మార్లు ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలను తమ పార్టీలోకి తీసుకోవటం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటంతోపాటు వైఎస్సార్ అభిమానులు, రెడ్డి, క్రిస్టియన్ సామాజిక ఓట్లను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటికే పలుమార్లు పాదయాత్రలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న షర్మిలను చేర్చుకోవడం తెలంగాణ లో కొంత మేర కలిసొస్తుందనే అంచనాలతో ఉన్నట్లు సమాచారం.
షర్మిల బెంగళూరులో మకాం వేసారు. మూడు రోజులుగా అక్కడే ఉన్న షర్మిల కాంగ్రెస్ కర్ణాటక సారధి డీకే శివకుమార్ ను కలిసారు. ఈ సమయంలోనే పార్టీలోకి రావాలంటూ షర్మిలకు ప్రతిపాదన అందినట్లుగా ప్రచారం సాగుతోంది. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయటంతో పాటుగా మరి కొన్ని సీట్ల గురించి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే చర్చలు కొనసాగే అవకాశం ఉంటుందదని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని వ్యూహకర్త సునీల్ కనగోలు సూచించినట్లు సమాచారం. ఇదే అంశాన్ని పార్టీ హైకమాండ్ కు వివరించినట్లుగా తెలుస్తోంది.
షర్మిల బెంగళూరులో డీకే శివకుమార్ ను కలిసి సుదీర్ఘ మంతనాలు చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పైన అభినందించారు. డీకేను కలిసిన ఫొటోలతో ట్వీట్ చేసారు. డీకే ను ఉద్దేశించి ప్రియమైన సోదరుడు శ్రీ డీకే శివకుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత జరుపుకొనే ఈ పుట్టిన రోజు మీకు మరింత మధురమైనదని, ముఖ్యమైనదని భావిస్తున్నాను. కర్నాటక ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..అంటూ ట్వీట్ చేసారు. ఇప్పుడు ప్రచారం సాగుతున్నట్లుగా రాజన్న కూతురు తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా లేదా అనేది స్ఫష్టత రావాల్సి ఉంది.
I extend my warm birthday greetings to dear brother Mr DK Shivakumar ji. This birthday must be especially sweeter and more momentous to you, after the tremendous victory of your party in the assembly elections. I pray to god to give you long life and great health to serve the… pic.twitter.com/V2ZkrZQAs4
— YS Sharmila (@realyssharmila) May 15, 2023