రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు: షర్మిల
Ys Sharmila: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ షర్మిల హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తరువాత షర్మిలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. ముందుగా ట్యాంక్ బండ్ వద్ద రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ 1 అని అన్నారు. మహిళలను ఎత్తుకు పోవడం లో రాష్ట్రం నెంబర్ 1 అని పేర్కొన్న ఆమె అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తున్నాం అని కేసీఅర్ సర్కార్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్న ఆమె రాష్ట్రంలో యేటా 20 వేల అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. కేసీఅర్ కి మహిళల పట్ల చిత్త శుద్ది లేదని, మహిళలు కేసీఅర్ కి ఓట్లు వేసే యంత్రాలని అన్నారు. తెలంగాణలో మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయరు అని ప్రశ్నించిన ఆమె మహిళా గవర్నర్ పైనే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అని అన్నారు. మహిళలకు రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. రాష్ట్రంలో కవితకు తప్ప ఎవరికీ రక్షణ లేదు అని ఈ సందర్భంగా షర్మిల విమర్శించారు.