YS Sharmila: భరోసా యాప్ కాళేశ్వరంలో కొట్టుకుపోయిందా – వైఎస్ షర్మిల
YS Sharmila attack on KCR Government
వైఎస్ షర్మిల హైదరాబాద్ లోని ట్యాంకు బండ్ పై దీక్షకు దిగారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నల్ల రిబ్బన్ ధరించి దీక్ష చేస్తున్నారు. మహిళల గౌరవం విషయంలో స్పందించని గులాబీ నేతలు, మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ పైన ఉన్నరాణీ రుద్రమ దేవి విగ్రహానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల అక్కడే దీక్షకు దిగారు. కేసీఆర్ నియంత పాలన పోవాలని షర్మిల కోరారు.
రాష్ట్రంలో మహిళలకు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఒక్కరోజేనే మహిళలకు గౌరవం ఇవ్వడం.. తరువాత మర్చిపోవడం సర్వసాధారణంగా మారిందని షర్మిల మండిపడ్డారు. మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలపై ఇన్ని రకాల దాడులు జరుగుతుంటే కేసీఆర్ సర్కార్ అద్భుతంగా పని చేస్తున్నామని ఎలా చెప్తున్నారని షర్మిల ప్రశ్నించారు. మహిళల మీద జరుగుతున్న దాడుల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని షర్మిల అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అని డ్వాక్రా రుణాల అంశం తెరపైకి తెచ్చారని షర్మిల విమర్శించారు.
భరోసా యాప్ ఉందని కేసీఆర్ కొడుకు చెప్తున్నారు ఎక్కడుంది.? కాళేశ్వరంలో మునిగిపోయిందా.? అని షర్మిల ప్రశ్నించారు.ల్యాండ్ మైన్ లో బతుకుతున్నట్టు తెలంగాణ మహిళలు బతుకుతున్నారని షర్మిల విమర్శించారు.
బిఆర్ఎస్ నాయకులను పాలకులు అనాలా లేదా తాలిబన్లు అనాలా.? అని షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా అనేక ప్రశ్నలు సంధించారు. మరియమ్మను లాక్ అప్ లోనే చంపేస్తే కేసీఆర్ ఏం చేసారని షర్మిల ప్రశ్నించారు. అదే విధంగా ఓ రేప్ కేసులో మంత్రి మనవడు, మిత్ర పక్షం ఎమ్మెల్యేల కుమారులు ఉంటే కేసీఆర్ ఏం చేశారని షర్మిల ప్రశ్నించారు.
ప్రీతి ఘటనలో ఎంక్వయిరీ కమిటీ ఎందుకు వేయలేదని షర్మిల నిలదీశారు. గవర్నర్ ని తీవ్రంగా అవమానించిన వ్యక్తికి ఎమ్యెల్యే టికెట్ ఇచ్చారని షర్మిల విమర్శించారు. మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తే ఎటువంటి స్పందన లేదని షర్మిల గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బిడ్డకు మాత్రమే రక్షణ, గౌరవం ఉన్నాయని..మిగతా వారెవరికీ లేదని షర్మిల అన్నారు.
ఓ దిక్కు మాలిన మంత్రి నన్ను మరదలు అన్నాడని.. ఇంకొక్కడు కొజ్జా అన్నాడని షర్మిల మండిపడ్డారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చిన గౌరవం అని ప్రశ్నించారు. టీచర్స్ ధర్నా చేస్తే వారిని మహిళలు అని చూడకుండా పిల్లలతో సహా అరెస్ట్ చేసారని షర్మిల గుర్తుచేశారు.