YS Viveka Case: ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ రోజు సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరు కావటం లేదు. ఖచ్చితంగా ఈ రోజు జరిగే విచారణకు రావాలని సీబీఐ అవినాశ్ కు సమన్లు జారీ చేసింది. ఇందుకోసం ఆయన కడప నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి వస్తారని భావించారు. ఈ రోజు సీబీఐ విచారణకు హాజరైన సమయంలో కీలక నిర్ణయం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు కూడా తరలి వచ్చారు. కానీ అవినాశ్ ఆకస్మికంగా తన నిర్ణయం మార్చుకున్నారు.
ఎంపీ అవినాశ్ నేటి సీబీఐ విచారణకు హాజరు కావటం లేదని సమాచారం. తన తల్లి అనారోగ్యంతో ఉన్నారనే సమాచారంతో ఆయన సడన్ గా పులివెందుల బయల్దేరారు.ఇదే విషయాన్ని లేఖ ద్వారా సీబీఐకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తన తల్లి అనారోగ్యంతో అవినాష్ రెడ్డి ఆందోళనలో ఉన్నారని, విచారణకు హాజరు కావటం లేదని మద్దతు దారులు చెబుతున్నారు. తల్లి అనారోగ్యం గురించి సమాచారం తెలిసిన వెంటనే అవినాశ్ రెడ్డి పులి వెందుల బయల్దేరారు. ఇప్పుడు అవినాశ్ ఇచ్చిన సమాచారం పైన సీబీఐ స్పందన తెలియాల్సి ఉంది.
అవినాశ్ హాజరు గురించి ఉదయం నుంచి టెన్షన్ వాతావరనం కనిపిస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా అవినాశ్ ను సీబీఐ విచారించింది. వాస్తవానికి, మంగళవారమే సీబీఐ అధికారుల ఎదుట విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, తనకు షెడ్యూల్లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూనే, శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు స్పష్టం చేసారు.ఇప్పుడు అవినాష్ మరోసారి హాజరు కాకుండా పులివెందుల వెళ్లటం..తల్లి అనారోగ్యం విషయం పైన సమాచారం ఇవ్వటంతో సీబీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సీబీఐకి అవినాశ్ లాయర్లు సమాచారం ఇచ్చారు. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదని చెప్పారు.విచారణకు హాజరయ్యే సమయంలో తల్లి ఆరోగ్యం గురించి తెలిసందని వివరించారు. అవినాశ్ తల్లికి గుండెపోటు రావటంతో ఆస్పత్రిలో చేర్చారని పేర్కొన్నారు. పులివెందులలోని దినేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తన తండ్రి జైల్లో ఉండటంతో తాను తన తల్లిని చూసుకోవాలని సీబీఐకి సమాచారం ఇచ్చారు. విచారణకు మరో తేదీ ఖరారు చేయాలని కోరారు. దీని పైన సీబీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పులివెందుల వెళ్తానని బయలుదేరిన అవినాష్ రెడ్డి శంషాబాద్లోనే ఆగినట్లు తెలుస్తోంది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో అవినాష్ ఆగినట్లు సమాచారం అందుతోంది.