MP Avinash Reddy: అవినాశ్ రెడ్డికి చుక్కెదురు..పిటిషన్ తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు
YCP MP Avinash reddy petition was rejected by TS High Court
కడప ఎంపీ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి చుక్కెదురయింది. తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డి పిటిషన్ తిరస్కరించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. అవినాశ్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా అరెస్టు చేయవద్దని తాము సీబీఐని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కొనసాగించాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు తెలిపింది. తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని అవినాశ్ రెడ్డి కోరిన విషయాన్ని తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. ఆడియో వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఆధారాలు సమర్పించిన సీబీఐ
ఏపీ మాజీ మంత్రి వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను తెలంగాణ హైకోర్టుకు సీబీఐ సమర్పించింది. హత్యకేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, కొంత మంది సాక్షుల వాంగ్మూలాలను, హత్య జరిగిన సమయంలో వివేకా రాసిన లేఖ, ఫోరెన్సిక్ పరీక్షల నివేదికలు, కేసు డైరీ తదితర వివరాలను సీల్డ్ కవర్‌లో ఉంచి తెలంగాణ హైకోర్టుకు సీబీఐ అందజేసింది