Yadadri Brahmotsavalu: కన్నుల పండుగగా దివ్య విమాన రథోత్సవం
Yadadri Brahmotsavalu: యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బుధవారం రోజున దివ్య విమాన రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెండి గరుడసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రికి తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దవ్యరధ విమానాన్ని అలంకరించారు.
అనంతరం, రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తిరు కల్యాణోత్సవ కార్యక్రమం ముగిసిన మరుసటి రోజున కల్యాణమూర్తులను దివ్యవిమాన రథంలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆగమ శాస్త్రం ప్రకారం మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు రాత్రివేళ మహానివేదన తరువాత రాత్రి 10:45 గంటలకు దివ్య విమాన రథోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి వేళ జరిగిన ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉండటం విశేషం. ఇక గరుడ సేవ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 3 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మార్చి 3 వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా,ఈ ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని నలుమూలల ప్రాంతాల నుండి భక్తులు యాదాద్రికి చేరుకుంటున్నారు.