KTR tweets: దేశాన్ని పాలిస్తోంది ఎవరో తెలుసా? మంత్రి కేటీఆర్ సెటైర్లు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఇటీవలే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్లను ఆధారంగా చేసుకుని కేటీఆర్ స్పందించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కూడా ఈడీ దర్యాప్తును ఎదుర్కోవలసి వస్తుందని బండి సంజయ్ కామెంట్ చేశారు. ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన కేటీఆర్ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
డియర్ పీఎంఓ ఇండియా అంటూ కేటీఆర్ తన ట్వీట్ మొదలు పెట్టారు. మీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీ.ఎస్.కుమార్‌ను ఈడీ చీఫ్‌గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న డబుల్ ఇంజన్ అంటే మోడీ అండ్ ఈడీ అని మాకు ఇప్పుడు స్పష్టంగా అర్ధమయిందని కేటీఆర్ సెటైర్లు వేశారు.
బండి సంజయ్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. జూన్ 21న విచారించిన దర్యాప్తు సంస్థ జూలై 25న మరోసారి తమ ముందు హాజరు కావాలని కోరింది. మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పలువురు కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈడీ విచారణను తప్పబడుతున్నాయి. ఈ విషంయలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కూడా ఏదో ఒక రోజును ఈడీ విచారణ ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. అందుకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనకు కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
జనం ఘోష-బీజేపీ భరోసా
తెలంగాణ బీజేపీ నేతలు ప్రస్తుతం జనం ఘోష-బీజేపీ భరోసా పేరిట బైక్ ర్యాలీ చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా నాంచర్పల్లిలో బైక్ ర్యాలీ సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు కూడా గతంలో దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్ పొందారని గుర్తుచేశారు. ధైర్యంగా విచారణ ఎదుర్కొన్నారే గానీ..కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చేస్తున్నట్లుగా ఎటువంటి ఆందోళనలు చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ చేపట్టిన భరోసా యాత్ర చేస్తున్న రోజునే ఈ పరిణామాలు జరగడంపై బండి సంజయ్ మండిపడ్డారు.
సిద్ధిపేటకు కేసీఆర్ చేసింది చాలా తక్కువ
కేసీఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించిన సిద్దిపేట ప్రాంతానికి ఆయన చేసింది చాలా తక్కువని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ చేపడుతున్న 10 రోజుల బైక్ యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు భరోసా కల్పిస్తామని, ఎటువంటి కష్టంలోనైనా తాము ఆదుకుంటామనే నమ్మకాన్ని కలిగిస్తామని బండి సంజయ్ అన్నారు.
బండి సంజయ్ చేసిన ఈడీ కామెంట్లపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న డబుల్ ఇంజన్ అంటే మోడీ అండ్ ఈడీ అని మాకు ఇప్పుడు స్పష్టంగా అర్ధమయిందని కేటీఆర్ సెటైర్లు వేశారు.
Dear @PMOIndia
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty
— KTR (@KTRTRS) July 22, 2022