హైదరాబాద్ లో ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి. నిజమైన ముత్యాలను, నకిలీ వాటిని ఎలా గుర్తించాలి. పెరల్ సిటీ హైదరాబాద్ పై ప్రత్యేక కథనం.
ముత్యాలనగరం గురించి ముచ్చట్లు..
Pearls: హైదరాబాద్ కు ఇంకో పేరేమైనా ఉందా అంటే టక్కున భాగ్యనగరం (Hyderabad) పేరు చెబుతారు అంతా. కానీ ముత్యాలనగరం పేరు కూడా ఉందని అతి కొద్ది మందికే తెలుసు. నవాబుల కాలం నుంచీ ముత్యాలకు ఫేమస్ అయిన హైదరాబాద్ నేటికీ ఆ మధురిమను కోల్పోకుండా అదే రాజసంతో వెలిగిపోతూనే ఉంది. ముత్యాలు అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ముత్యాలు అన్నంతగా ముద్ర వేసుకుని వ్యాపారులనే కాదు.. పర్యాటకులు క్యూ కట్టేలా చేస్తోంది. ఛార్మినార్ లో ముత్యాలకు మాత్రమే ఫేమస్ అయిన షాపుల్లో .. రాశులుగా పోసిన ముత్యాలు లేకపోయినా.. ముత్యాల రాశులు మాత్రం రారా రమ్మని పిలుస్తూ ఉంటాయి.అసలు ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి. నిజమైన ముత్యాలను, నకిలీ వాటిని ఎలా గుర్తించాలి. పెరల్ సిటీ హైదరాబాద్ పై ప్రత్యేక కథనం.
ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకునే ముత్యాలు..
నిజం చెప్పాలంటే ఛార్మినార్ ప్రాంతాన్ని చూడటానికి మాత్రమే వెళ్లేవారిని కూడా కనీసం ఓ ముత్యాల దండో.. కొన్ని ముత్యాలో .. కొనేంత అందంగా ఆ పెరల్స్ టెంప్ట్ చేస్తుంటాయి. వాటి కంటే ముత్యాలు రాలేలా మాట్లాడే ఆ షాపు యజమానుల మాటలకు ఫిదా అయిపోయి పెరల్స్ కొని కానీ.. తిరిగి రారంటే అది అతి శయోక్తి కూడా కాదేమో. అందుకే హైదరాబాద్ ముత్యాలు (Pearls of Hyderabad) అంటే ప్రపంచానికి ఒక ప్రత్యేకం. ఇక్కడ ముత్యాలు తయారుచేసే పరిశ్రమలు లేకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ముత్యాలకు నెలవుగా ఈ భాగ్యనగరం ముద్ర వేసుకుంది. పాత బస్తీలో హోల్ సేల్ షాపు (Wholesale shop in Old Basti)లలో అయితే ముత్యాలకు దేశవ్యాప్తంగా గిరాకీ బాగా పెరిగిపోయింది.
సాధారణంగానే ఛార్మినార్ అంటేనే..టూరిస్ట్ ప్రాంతంగానే కాదు.. షాపింగ్ కోసం ది బెస్ట్ ప్లేస్ గా ఏళ్ల నాటి నుంచి స్టాంప్ వేసేసుకుంది. అందుకే సీజన్ ఏదయినా ఛార్మినార్ స్ట్రీట్స్ మాత్రం సందర్శకులతో కిక్కిరిసిపోయే ఉంటాయి. ఆల్ ఇన్ వన్ దొరికే ప్లేస్ గా చెప్పుకునే ఛార్మినార్ ప్రాంతం.. ముత్యాలకు కూడా అంతే ఫేమస్ .ఇక్కడ గల్లీ గల్లీలోనూ జిగేల్మనిపించే లైట్ల మధ్య కళ్లు చెదిరే ముత్యాలు.. కనువిందు చేస్తుంటాయి. అందుకే కేవలం ముత్యాలు కొనడానికి భాగ్యనగరానికి వచ్చే వాళ్లకు ఏమాత్రం కొదవ ఉండదు.
హైదరాబాద్ లో ఎన్నికోట్ల ముత్యాల బిజినెస్ జరుగుతుంది?
హైదరాబాద్ లో ముత్యాలు తయారు చేసే పరిశ్రమలు లేకపోయినా.. ఇక్కడ ఏడాదికి రూ. 500 కోట్ల ముత్యాల వ్యాపారం జరుగుతుంది. అందులో దాదాపు 40 శాతం వ్యాపారం టూరిస్టుల మీదే జరుగుతుంది. అయితే అసలే మాత్రం నాలెడ్జి లేకుండా ముత్యాలు కొనడానికి వెళ్తే మాత్రం .. అడ్డంగా మోసపోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది. అందుకే ముత్యాలు నాణ్యమైనవా కాదా, వాటి ఆకారం,రంగు ఎలా ఉన్నాయనే వాటిపై కనీస అవగాహనతో రావాలని స్వయంగా ముత్యాల షాపుల వారే చెబుతారు. రెగ్యులర్ గా కొనేవాళ్లకు ఏ దుకాణంలో నాణ్యమయినవి దొరుకుతాయో… క్లారిటీ ఉంటుంది కానీ లేని వాళ్లు మాత్రం కాస్త చూసి కొనాల్సిందే అంటారు.
హైదరాబాద్‌లో 1906లో మొట్టమొదటి ముత్యాల దుకాణం (The first pearl shop) వెలిసింది. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి హైదరాబాద్ లో రెండే రెండు ముత్యాల దుకాణాలు ఉండేవట. ఏళ్లు గడిచే కొద్దీ 300 పైగా దుకాణాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్లో ఎంతో నైపుణ్యం ఉన్న ముత్యాల కళాకారులున్నారు. హాంగ్ కాంగ్,జపాన్,చైనా నుంచి హైదరాబాద్ కు ముత్యాలు దిగుమతి చేసుకుంటారు. ఛార్మినార్ దగ్గర పత్తర్ గాటి, లాడ్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్ లో కూడా ముత్యాలకు ఫేమస్ అయిన షాపులున్నాయి. కేవలం ముత్యాలనే కాకుండా పెరల్ జ్యువెలరీనే ఎక్కువ మంది కొంటూ ఉంటారు. రకరకాల డిజైన్స్ తో.. మగువలనే కాదు మగవారిని కూడా అట్రాక్ట్ చేసేస్తాయి హైదరాబాద్ ముత్యాలు.అయితే ఈ ముత్యాలు ఎలా తయారవుతాయి అన్న అనుమానం చాలామందిలో ఉంటుంది.
ముత్యాలు ఎలా తయారవుతాయి?
ముత్యాలకు 5500 ఏళ్ల చరిత్ర ఉందని చరిత్ర కారులు చెబుతారు. చైనాలో కూడా 4000 ఏళ్ల క్రితం కూడా ముత్యాలు వాడినట్టు ఆధారాలున్నాయి. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పెరల్.. కోడిగుడ్డంత సైజులో ఉంటుందట. దాని బరువు 454 క్యారెట్లు. భారత దేశంలో అతి పెద్ద ముత్యం పేరు.. లా పెరెజిమా. దీని బరువు 28 క్యారెట్లు. నిజానికి ముత్యాలను ప్రకృతిలో లభించే నవరత్నాలలో ఒకటిగా చెబుతారు. మొలాస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలో ఇవి తయారవుతాయి. కొన్ని ఇసుక రేణువులు ముందుగా ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వల్ల ముత్యపు చిప్ప.. వాటిపైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అదే చివరకు గట్టిపడి ముత్యంగా మారుతుంది.
ముత్యాలను సేకరించాలంటే సము ద్రపు ఆడుగున వెతకాల్సిందే. అప్పట్లో ఒక ముత్యాల హారం తయారు చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ధర కూడా ఎక్కువే ఉండేది. కాబట్టి ధనికులు, ఉన్నత వర్గాల వారి ఇంట్లోనే ముత్యాలు ఉండేవి. ముత్యాలు కాల్షియం కార్బొనేట్ అనే పదార్థంతో తయారవుతాయి. కొన్ని నీటి బిందువు ఆకారంలో, కొన్ని అండాకారంలో, కొన్ని అర్థ వృత్తాకారంలో ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఇంకా బిందువు ఆకారంలో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి. ముత్యాల నిర్మాణం పొరలు, పొరలుగా ఉండటం వల్ల..ముత్యాలను ఈజీగా పగలకొట్టలేరు.
ముత్యాలకు రంధ్రాలు సహజంగానే వస్తాయా?
ముత్యాలలో మంచి నీళ్లలో ఏర్పడినవి..ఉప్పునీటిలో ఏర్పడినవి అనే రెండు రకాలుగా ఉంటాయి. ఈ ముత్యాలు (pearls) చూడ్డానికి ఒకే రకంగా అనిపించినా.. వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి. వీటిని సేకరించాక.. ఈ ముత్యాలకు రంధ్రాలు చేస్తారు. తర్వాత ఈ ముత్యాలను 4 రోజుల వరకు ఉడక పెట్టి ..వాటి రంగు మెరుగుపడేలా బ్లీచ్ చేస్తారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, నీళ్లు ఉన్న గాజు సీసాల్లో వాటిని ఉంచి..అడుగున గాజు ఉన్న సన్ బాక్సులలో ఉంచి ఎండ తగిలేలా ఉంచుతారు. చివరగా వాటిని కడిగి వాటి ఆకారాలు, పరిమాణాల ఆధారంగా వాటిని సెపరేట్ చేస్తారు. రంగు ఆధారంగా కూడా ముత్యాలను గ్రేడ్ చేస్తారు.
గులాబీ రంగు, నలుపు రంగులో ఉన్న ముత్యాలు మంచి నాణ్యమైనవిగా, తెల్ల ముత్యాలను సంప్రదాయకమైనవిగా గుర్తిస్తారు. మంచి, నాణ్యమైన ముత్యాలు నీలి రంగు మెరుపును కలిగి ఉంటాయి. అదే తక్కువ నాణ్యత గల ముత్యాలు.. ఆకుపచ్చ లేదా పసుపు రంగు పూతతో ఉంటాయి. నల్ల ముత్యాలు ఆకుపచ్చ పూతతో వంకర టింకరగా ఉంటాయి. ఇంద్రధనుస్సు రంగులు కనిపించే నల్ల ముత్యాలు కూడా విలువైన వెరైటీలుగానే చెబుతారు. నలుపు, గులాబీ ముత్యాలు అరుదుగా దొరుకుతాయి. చాలావరకు హైదరాబాదీ ముత్యాల నగలు వీటితోనే తయారవుతాయి.ఇప్పుడు యూరోప్, అమెరికాకు కూడా ముత్యాలు భాగ్యనగరం నుంచే ఎగుమతి చేస్తున్నారు.
ముత్యాలను పరిశ్రమలలో ఎలా తయారు చేస్తారు?
1900 వరకూ సహజ ముత్యాలే దొరికేవి. తర్వాత కృత్రిమ ముత్యాలను (Artificial pearls) జపాన్ దేశస్తుడు అయిన మికీమోటో తయారు చేసి ముత్యాల చరిత్రనే మార్చేశాడు. ముత్యపు పురుగులతో కృ త్రిమంగానే ముత్యాల సాగు (Pearl cultivation) మొదలు పెట్టేశాడు. అయితే సహజంగా తయారయ్యే ముత్యానికి, సాగు ముత్యాలకు ఒకటే తేడా ఉంటుంది. అసలు ముత్యంలో కేంద్రకణం తనకు తాను.. ముత్యపు పురుగులోకి ప్రవేశిస్తుంది. కృత్రిమ ముత్యంలో.. కేంద్రకణం కృత్రిమంగా ఉంచబడుతుంది. అలా ఆ ముత్యాల సాగు చైనా,జపాన్,మయన్మార్, భారతదేశాలలో పెద్ద వ్యాపారంగా మారిపోయింది.
ముత్యాలు మంచివా కావా ఎలా తెలుసుకోవచ్చు?
ముత్యాలు మంచివా కాదా. ఎలాంటి ఆకారంలో ఉన్నవి మంచివి. ఏవి మంచివి కావు అనే విషయాలు చాలామందికి తెలియవు. తీరా కొన్న తర్వాత అసలు ఇవి ముత్యాలే కావు.. మోసపోయావని అనేవాళ్లూ ఉంటారు.అందుకే కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ చాలా వరకూ సాగు చేసిన ముత్యాలే అంటారు దుకాణదారులు.
తెల్లటి క్లాసిక్ ముత్యాలుగా చెప్పే అకోయా ముత్యాలు..ఎక్కువగా మెరుపు, చాలా ఎక్కువ నునుపుని కలిగి ఉంటాయి. ఇవి 10,11 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటాయి. 7,7.5 మిల్లీ మీటర్లు అంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నవి..కాస్త ఎక్కువ రేటు ఉంటాయి. అకోయా ముత్యం సాధారణంగా తెలుపు లేదా క్రీమ్ కలర్లో ఉంటుంది. ఇంకా, గులాబీ లేదా దంతపు పూతతో ఉంటుంది.
నిజానికి చాలా రంగుల్లో ముత్యాలు (Pearls in many colors) దొరుకుతాయి. తెలుపు,లేత వంగపువ్వు రంగు,బంగారు రంగు,గులాబీ, ఆకుపచ్చ ఉండే ముత్యాలు ఉంటాయి. ఇవి ఆభరణాల తయారీకి బాగుంటాయి. అయితే ఎన్నిరంగులున్నా తెలుపు ముత్యాలు కొనేవారే ఎక్కువమంది ఉంటారు. అలాగే మంచి ఆకారంలో ఉన్న ముత్యాలు కొనుక్కోవడం మంచిది.అంతేకాదు ముత్యం ఉపరితలం ద్వారా ముత్యం నాణ్యతను ఈజీగా చెప్పొచ్చంటారు. గీతలు,గ్యాప్‌లు ఉంటే ఇవి త్వరగా విరిగిపోతాయి. అలాగే మచ్చలు, చిన్న చిన్న బొబ్బలుగా, ముడతలుగా ఉన్నవాటిని కూడా కొనకూడదు. మెరిసే ముత్యాలను కొనాలి. ముత్యం ఉపరితలం నున్నగా లేకపోతే రంగులో మెరుపు కూడా ఉండదు.
చాలామంది ముత్యం మంచిదో కాదో తెలుసుకోవడానికి పంటి పరీక్ష చేస్తారు. ముందు పళ్ల మధ్యన ముత్యాన్ని పెట్టి కొరికి చూస్తే మెత్తగా తగిలితే నకిలీ అని..గట్టిగా ఉంటే మంచివి అని అర్థమట. ముత్యాలు కొనేముందు ఈ విషయాలు తెలుసుకుంటే మంచి ముత్యాలను మీ సొంతం చేసుకోవచ్చు.