దేశానికి రెండో రాజధాని స్థాయికి అప్‌గ్రేడ్ అయిన గ్రేటర్ హైదరాబాద్‌కు అనుబంధంగా మరో మహా నగరం నిర్మితం కాబోతుందా ?అంటే అవుననే అంటున్నారు గ్రేటర్ వాసులు.
GO 111: దేశానికి రెండో రాజధాని స్థాయికి అప్‌గ్రేడ్ అయిన గ్రేటర్ హైదరాబాద్‌కు అనుబంధంగా మరో మహా నగరం నిర్మితం కాబోతుందా ?అంటే అవుననే అంటున్నారు గ్రేటర్ వాసులు. ఐటీ, ఇండస్ట్రియల్, మాన్యుఫాక్చరింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలవడంతో పాటు బెస్ట్ లివింగ్ సిటీల్లో అగ్ర భాగాన నిలిచిన మన సౌభాగ్య నగరం వచ్చే ఐదేళ్లలో రెండింతలు విస్తరించనుంది. 84 గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అడ్డుకట్టగా మారిన 111 జీవోను పూర్తిగా ఎత్తివేసిన ప్రభుత్వం ఆ పరిధిలోని దాదాపు లక్షా 32 వేల ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ సిటీ నిర్మాణానికి భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఈ జీవో తీసేస్తే దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా. ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే 18 వేల ఎకరాలకు పైగా ఉంది. దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. ఇక ప్రైవేటు భూముల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పాల్సిన పని లేదు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధి నలువైపులా విస్తరించినప్పటికీ… నగరానికి నైరుతిలో ఉన్న ఈ 84 గ్రామాల్లో మాత్రం విస్తరణ నిలిచిపోయింది. ప్రధానంగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లోని సంస్థల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని దాటి అభివృద్ధి విస్తరించింది. మరోవైపు రియల్ రంగం అనేది హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల మేర విరాజిల్లుతున్నా… జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం విస్తరించలేకపోయింది. నగరం చుట్టూ ఉన్న భూముల రేట్ల ప్రకారం బేరీజు వేస్తే… ఇతర ప్రాంతాల్లో పది అంతకంటే రెట్ల విలువలు ఉన్నాయి. 111 జీవో 84 గ్రామాలకు ప్రజలకు పెద్ద గుదిబండగా ఉండేది. దీంతో ఈ గ్రామాల ప్రజలు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి పనులు చేయాలన్నా.. నిర్మాణాలు చేపట్టాలన్నా 111 జీవో నిబంధనలు ఆటంకంగా మారాయి. అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా కొనుగోలుదారులు తక్కువ ధరలకు అడిగేవారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుని. అన్ని రకాలుగా న్యాయ నిపుణులు, సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తరువాత జీవో 111 ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ ఈ నిర్ణయంతో నిత్యం రద్దీతో ఉండే మహానగరాన్ని వదిలి ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని అప్పర్ స్టేజ్‌లో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ అటువైపే దృష్టి కేంద్రీకరించాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కొనిపెట్టిన టాప్ 20 స్థిరాస్తి నిర్మాణ సంస్థలు ఇప్పుడు నిర్మాణ కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయి.లక్ష ఎకరాల వరకు ప్రైవేటు భూములు అందుబాటులోకి రానున్నాయి. ఆయా భూముల్లో ఎవరైనా లేఅవుట్ చేయాలన్నా, అపార్ట్మెంట్ నిర్మించాలన్నా తొలుత హెచ్ఎండీఏకు సీఎల్‌యూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ జోన్లకు మాత్రమే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిసింది. మల్టీపర్పస్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ తదితర జోన్లకు ఈ ప్రాంతంలో పూర్తిగా నిషేధం విధించినట్లు సమాచారం. లక్ష ఎకరాల వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడానికి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెన్ద్మెంట్ 2006 నిబంధనల్ని పూర్తిగా వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్లల్లో రాబడి రానుంది. ఈ జీవో ఎత్తివేతతో చేవెళ్ల ప్రాంతం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది. చేవెళ్ల ప్రాంతం మరో గోపన్‌పల్లి, గచ్చిబౌలి కానున్నది. మరో పక్క రాబోయే రోజుల్లో ట్విన్ సిటీ కాస్త ట్రై సిటీగా పిలవబడడానికి ఎక్కువరోజులు లేవు.
111జీవో ఎత్తివేతతో ప్రభుత్వానికి కాసుల పంట కురవనుంది. ప్రస్తుతం ఈ జీవో అమల్లో ఉన్న ప్రాంతాల్లో 31,483 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, సీలింగ్ భూములు ఉన్నాయి. సర్కార్ చేతిలో ఉన్న భూముల విలువ రూ. రెండులక్షలకోట్లకుపైనే ఉంటుందని అంచనా. జీవో సడలింపు వల్ల ఈ భూములను కొత్త కంపెనీలకు కేటాయించడంతో పాటు ఆర్ధిక అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి అతి త్వరలోనే వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. జీవో ఎత్తివేత తర్వాత ఏ పద్ధతిలో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో అర్థంకావడం లేదు. విధి విధానాలు వెల్లడైన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇక హైదరాబాద్ లో ఐటీ కారిడార్లన్ని నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాబట్టి ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు సొంత నివాసగృహాలు ఇప్పడు మొయినాబాద్, చేవెళ్ల, గండిపేటపరిసరప్రాంతాలో నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని చుస్తునారు. ఇక నగర జనాభా కూడా ఎక్కువగా శివారు ప్రాంతాల్లో నివసించడానికి మొగ్గు చూపిస్తున్నారు. కనుక హైదరాబాద్ లో ట్రాఫిక్ కూడా కొంతమేర తగ్గనుందని అభిప్రాయం. ఇక జీవో ఎత్తివేతతో హైదరాబాద్ నగరానికి సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. నగరంలో కూడా అపార్ట్మెంట్ ధరలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.