111 జీవో ఎత్తివేత వెనుక ప్రభుత్వ వ్యూహం ఏమిటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోతుందా?
G.O. 111 CANCELLED : తెలంగాణ ప్రభుత్వం మరో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని జంట జలాశయాల పరిధిలో అమలులో ఉన్న జీవో111ను (111g.o. cancelled) పూర్తిగా ఎత్తివేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం (cabinet approved) తెలిపింది. దీనివల్ల 84 గ్రామాల (84 villages) పరిధిలోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. గత ఎన్నికల హామీని అమలు చేశామని అంటోంది. జీవో రద్దు చేయడంపై నిపుణుల కమిటీ వేశామని, అది వచ్చాక ఎత్తేస్తామని సీఎం కేసీఆర్ (cm kcr) అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కమిటీ నివేదిక విషయంలో ఏం చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే ప్రభుత్వం జీవోను రద్దు చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఉస్మాన్‌సాగర్ (osman sagar), హిమాయత్‌సాగర్ (himayat sagar) జలాశయాల పరిరక్షణకు తీసుకొచ్చిన జీవోను రద్దు చేయడం పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే చర్య అనే వాదనలు వినిపిస్తున్నాయి. గత సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం లేదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ (Hyderabad) రియాల్టీపై (Real estate) జీవో రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందని బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్ సిటీలో స్థలాల ధరలు పడిపోతే కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆందోళన వెలిబుచ్చుతున్నారు.
111 జీవో పరిధి ఎంత..?
గ్రేటర్ హైదరాబాద్‌లోని 7 మండలాల్లో 84 గ్రామాలు జీవో 111 పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు ఉంది. తాజా నిర్ణయం వల్ల కొత్తగా 500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరగనుంది. మొయినాబాద్ (Moinabad), శంషాబాద్ (shamshabad), కొత్తూరు, రాజేంద్రనగర్ (Rajendranagar), శంకర్పల్లి (shankerpally), చేవెళ్ల (chevella) మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అమరావతికి మూడింతలు మించి భూమి సమకూరనుంది. దీనివల్ల మరో మహానగరం ఆవిర్భవించే అవకాశం ఏర్పడనుంది. రాజధానిలో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. నగరం చుట్టు పక్కల అపార్ట్మెంట్లు, స్కైటవర్లు వెలుస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ గేటెడ్ విల్లాలు పుట్టుకొస్తున్నాయి. జీవో 111ను ఎత్తేయడం వల్ల గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాలకు భారీగా భూమి అందుబాటులోకి రానుంది. ఆ ప్రాంతంలో కొత్తగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. అలాగే ట్రాఫిక్ చిక్కుల్లో ఇరుక్కుంటున్న మహానగరానికి కూడా కొంత ఊరట దక్కనుంది.
రియల్ దందాయేనా..?
జీవో 111 ఎత్తివేత వెనక పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పరిధిలో ఇప్పటికే 80 శాతం భూములు రాజకీయ నాయకుల (politicians) చేతుల్లో ఉన్నాయి. అక్కడ భారీగా విల్లాలు, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాటన్నింటిని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నిర్ణయం వల్ల బడాబాబులు తమ భూములతో రియల్ ఎస్టేట్ దందా చేసి వేల కోట్లు ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవో 111 పరిధిలోనే ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు బినామీ పేర్లతోనూ భారీగా స్థలాలు దక్కించుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. సొంత ప్రయోజనాల కోసమో జీవోను రద్దు చేశారని ఆరోపిస్తున్నాయి. రైతుల చేతుల్లో ప్రస్తుతం 30 నుంచి 40 వేల ఎకరాలే ఉన్నాయాని లెక్కలు చెబుతున్నాయి.
స్థలాల రేట్లు తగ్గుతాయా..?
జీవో 111 ఎత్తివేయడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు మరింత ఊతం ఇస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మహానగరం పరిధిలో భూముల రేట్లు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రధాన నగరం పరిధిలో అయితే సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అపార్ట్మెంట్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. అందులోనూ 50 లక్షల లోపు ఫ్లాట్లే కొనగలుగుతున్నారు. జీవో 111 ఎత్తివేయడం వల్ల నగరంలో సామాన్యులకు కొంత ఊరట దక్కవచ్చని నిర్మాణ రంగ నిపుణులు (builders warn) చెబుతున్నారు. మరో మహానగరం నిర్మించేంత భూమి అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని విశ్లేషిస్తున్నారు. శంషాబాద్ వైపు మెట్రోరైల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వల్ల మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు.
కాసుల పంటేనా..?
హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ-హెచ్ఎండీఏకు (hmda) కాసుల పంట పండనుంది. జీవో 111 పరిధిలో హెచ్ఎండీఏ నిబంధనలే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాణ అనుమతులు, నాలా కన్వర్షన్, లేఔట్ల రూపంలో భారీగా ఆదాయం సమకూరనుంది. రూ.6000 కోట్ల వరకు సంస్థకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జీవో 111 రద్దు చేసిన ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతం అంతా బయో కన్జర్వేషన్ జోన్లో ఉంది. 10 శాతం భూమిలో మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఉంది. 90 శాతం భూమిని పచ్చదనం కోసం కేటాయించాలి. ప్రభుత్వ నిర్ణయం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోనున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగానికి కనీసం 70వేల ఎకరాలు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
జలాశయాల మాటేంటి..?
హుస్మాన్సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనధికారిక కట్టడాల వల్ల హైదరాబాద్‌కు గుండెకాయ వంటి తాగునీటి చెరువులు కలుషితం అవుతున్నాయి. జీవో 111ను ఎత్తేయడం వల్ల పర్యావరణానికి (environment) తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువన బఫర్ జోన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నా జలాశయాలు మరో హుస్సేన్‌సాగర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. చెరువులను మురుగు నుంచి కాపాడేందుకు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటున్నా 70వేల ఎకరాల పరిధిలో వచ్చే భారీ కాలుష్యాన్ని నిలువరించడం అంత సులువు కాదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఎవరికి ప్రయోజనం..?
ప్రభుత్వం రద్దు చేసిన 111జీవో న్యాయస్థానంలో నిలుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు (supreme court) ఉత్తర్వులను నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1996లో జీవో 111ను తెచ్చారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం పరిశ్రమలు నెలకొల్పకుండా సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఫలితంగా రైతులు ఎంతో కొంత వచ్చినా చాలని రైతులు భూములు అమ్మేశారు. 2007లోనూ జీవో ఎత్తేస్తారని ప్రచారం జరిగింది. అది జరగక పోవడంతో రైతులు భూములను తక్కువ ధరకే అమ్మేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2019లోనూ మరోసారి 111జీవో ఎత్తేస్తామనే హామీ తెరపైకి వచ్చింది. తాజాగా జీవోను ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడగా భూములు కొనేందుకు రియల్టర్లు ఎగబడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యావరణ పరిరక్షఅంశాలు విస్మరించి కొంటే చేతులు కాలుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యాయస్థానంలో నిలుస్తుందా..?
జీవో 111 పరిధిలో వ్యవసాయం (agriculture) తప్ప ఏ రంగానికి భూమి కేటాయించేందుకు వీల్లేదు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీ పర్యవేక్షించాలి. జీవో పరిధిలో జీ ప్లస్ టు నిర్మాణాలకు మించి కట్టకూడదు. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఖాళీ స్థలాలు, రోడ్లకు వదలాలి. 90 శాతం కన్జర్వేషన్‌కు కేటాయించాలి. ఇవన్నీ పాటించాల్సిన చోట ప్రభుత్వ నిర్ణయం కోర్టుల్లో నిలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే జీవో పూర్తిగా రద్దవుతుందా? వేరే రూపంలో మళ్లీ కొన్ని నిబంధనలతో ముందుకు వస్తుందా? తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంత వరకు నిబంధనలు సడలించే అవకాశం ఉందనే స్పష్టత రావాలి.