Central Agencies Strategy: ఢిల్లీ టు హైదరాబాద్ వయా లిక్కర్ పాలసీ
Central Agencies Strategy: ఢిల్లీ లిక్కర్ పాలసీపై కేంద్ర ఏజెన్సీలు దూకుడు పెంచాయి. గతేడాది సెప్టెంబర్ మాసంలో ఈ కేసు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ కేంద్ర ఏజెన్సీల చేత విచారణ జరిపించాలని లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. సెప్టెంబర్ 27వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 11 మందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిని ఈడీ విచారించింది. ఇందులో విజయ్ నాయర్, సమీర్ మహేందు, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి,వినయ్ బాబు, రాఘవరెడ్డి, ప్రేమ్ రాహుల్, గౌతమ్ మల్హోత్రా, రామచంద్ర పిళ్లై, మనిష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.
ఒక్కోక్కరిగా విచారణ చేపడుతూ వారి నుండి తగినంత సమాచారాన్ని రాబడుతూ నోటీసులు జారీ చేస్తూ ఈడీ అరెస్టులు చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసింది. కాగా, ఇటీవలే ఈడీ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన తరువాత విచారణ చేపట్టింది. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. రామచంద్రపిళ్లై ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఈడీ తరుపరి యాక్షన్‌కు సిద్దమైంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
గతంలో సీబీఐ అధికారులు కవితను ఒకమారు విచారించారు. ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ వచ్చిన సీబీఐ అధికారులు ఆమెను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే విచారించారు. సుమారు ఆరు గంటలకు పైగా విచారణ జరిగింది. సీబీఐ అధికారులు ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి విచారణ నిర్వహించగా, ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఆమె ఢిల్లీ వెళ్లక తప్పడం లేదు. రామచంద్రపిళ్లై ఇచ్చిన వాగ్మూలంతో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి.
తాను కవిత బినామినని, ఆమె చెప్పడంతోనే ముడుపుల వ్యవహారం నడిచిందని రామచంద్ర పిళ్లై ఈడీ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఈ వాగ్మూలం తరువాతే ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాలో కవిత కూడా పాల్గొననున్నారు. దానికంటే ఒకరోజు ముందుగానే కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
ఈ విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కవిత అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జగరనున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయితే దానిని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకొని అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. అంతేకాదు, టీఆర్ఎస్‌పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్, దేశంలో మోడీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ దూకుడుకు ఇది కొంత విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది.
కేంద్రం చేతుల్లో ఉన్న ఏజెన్సీలను వినియోగించి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానిక నేతలు చెబుతన్నారు. అయితే, కేంద్ర ఏజెన్సీలు ఎవరి చేతుల్లోనూ ఉండవని, అవి ఇండివిడ్యువల్ బాడీలనీ, వాటి పని అవి చేసుకుంటూ పోతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. తప్పు ఎవరు చేసినా ఏజెన్సీలు వదిలిపెట్టవని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కామ్ కేసు హైదరాబాద్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.