Cold Waves: వణికిస్తున్న చలి- పడిపోయిన ఉష్ణోగ్రతలు
Cold Waves in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదు అవుతుండటంతో పాటు చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. చలికాలం చివర్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. రాజేంద్రనగర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. నగరంలో కంటే, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతగా పెరిగింది. దీనికి పొగమంచు తోడవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 4.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
నీరు గడ్డగట్టే చలి ఉండంతో ఆ ప్రాంత వాసులు బయటకు రావొద్దని వాతావరణశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 6 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సిర్పూర్ కాగజ్‌నగర్లో 4.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా తట్టేపల్లిలో 5 డిగ్రీలు, తలకొండపల్లి చుక్కాపూర్‌లో 5.2 డిగ్రీలు, శంషాబాద్‌లో 6.5 డిగ్రీలు, సికింద్రాబాద్‌లో 8.9 డిగ్రీలు, జూబ్లీహిల్స్‌లో 10.5 డిగ్రీలు నమోదయ్యాయి. మరో పదిరోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా నమోదయ్యే అవకాశాలు ఉంటాయని, ప్రజలు బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.