వానరాక ప్రాణం పోక చెప్పలేమని అంటారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఎప్పుడు మేఘావృతం అవుతుందో ఎప్పుడు ఎండలు మండిపోతాయో అర్థంగాక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు అనుకోకుండా చల్లగా పలకరిస్తూ వర్షాలు కురిశాయి.
Weather Changes in Telugu States: వానరాక ప్రాణం పోక చెప్పలేమని అంటారు. ప్రస్తుత పరిస్థితులు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఎప్పుడు మేఘావృతం అవుతుందో ఎప్పుడు ఎండలు మండిపోతాయో అర్థంగాక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు అనుకోకుండా చల్లగా పలకరిస్తూ వర్షాలు కురిశాయి. అంతలోనే ఎండలు మండిపోయాయి. ఆ వెంటనే ఎండలు… మరలా రాత్రయ్యే సరికి వర్షం… ఇలా ఒక్కరోజులోనే రకరకాల వాతావరణ పరిస్థితులు కనిపిస్తుండటంతో సాధారణ ప్రజలే కాదు, ఐఎండీ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారుతుందని అంచనా వేశారు. దీనిపేరు మోచాగా నామకరణం చేశారు. మే 6 వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పారు. అల్పపీడనం ఏర్పడి తుఫానులు సంభవిస్తే దాని బారి నుండి ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో, సురక్షితంగా ఏ ప్రాంతానికి తరలించాలో అన్ని స్కెచ్ వేసి ఉంచారు. కానీ, మోచా తుఫాను తెలుగురాష్ట్రాలను ఇప్పటి వరకు పలకరించలేదు. పైగా రెండు రోజుల నుండి ఎండల శరాఘాతాలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు.
దాహార్తితో నేలలు ఎండిపోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో తగుదునమ్మా అంటూ వచ్చి రైతులకు కడగండ్లను మిగిల్చి వెళ్తుంది… ఉగాది తరువాత మామిడి పూత పూసి కాయలు కాసే సమయంలో ఆనందాన్ని ఎవరూ కోరుకోరు అంటూ గాలులు, వానల రూపంలో దండయాత్ర చేసి పంటను నేలమట్టం చేస్తుంది. చేతికొచ్చి కొడుకు కాటికెళ్లితే ఆ కుటుంబం ఎంతగా బాధపడుతుందో, అంతకంటే ఎక్కువగా రైతులు బాధపడుతున్నారు. సాధారణంగా వేసవిలో ఎండలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయితే, ఏప్రిల్ నెలలో వానలు కురవడంతో వాతావరణం చల్లబడింది.
అదేవిధమైన వాతావరణం కంటిన్యూ అవుతుందని సామాన్యులు అనుకున్నారు. కానీ, వేసవిలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాన్లు వేసుకున్నా ఉక్కపోస్తున్నది. కూలర్లు తిరుగుతున్నా కూల్ కావడం లేదు. బయటకు అడుగుపెడితే మాడు పగిలిపోయే ఎండ, ఇంట్లోనే కూర్చుంటే కూసాలు కదిలించే అప్పులు, తిప్పలు, ఆకలి ఆర్తనాదాలు… ఎండకు భయపడితే జీవితంలో ఓడిపోకతప్పదని గ్రహించి మండే ఎండల్లోనూ శారీరక కష్టం చేస్తుంటారు. వరుణదేవుడు చల్లనిచూపులు చూస్తే చాలని సంబరపడిపోతుంటారు. రోహిణి కార్తె ప్రవేశించక మునుపే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రవేశిస్తే రోళ్లు పగిలిపోవడం ఖాయం.
ఈ వాతావరణ పరిస్థితుల నుంచి బయటపడాలంట వచ్చెనెల వరకు ఆగాల్సిందేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో వారం పదిరోజులపాటు ఇలాంటి గడ్డుపరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ప్రచారం చేస్తున్నారు. వానలు, ఎండలు తగ్గేదిలే అంటూ ఒకదానితరువాత ఒకటిగా దాడులు చేస్తున్నాయి. ప్రకృతి సహజ సమతుల్యాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఒకవేళ ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని వదిలేస్తే పరిణామాలు కూడా రీతిగా ఉంటాయి. ప్రకృతి మన చేతిల్లోఉండదు, వాతావరణంలో మార్పులు చెప్పిరావు… మనిషి తన ఆలోచనలను కాస్త అదుపులోపెట్టుకొని నడుచుకుంటే ఎంతటి ఎండాకాలంలోనైనా కొంత ఉపశమనం లభిస్తుంది. ఎండాకాలంలో బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బయటకు వెళ్లే సమయంలో లిక్విడ్స్ను వెంట తీసుకెళ్లాలి. తాజా ఫ్రూట్ జ్యూసులు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా సీ విటమిన్ విటమిన్ను ఆహారంలో తీసుకోవాలి. సిల్క్, కోటులు వంటి వాటికంటే ఖద్దరు దుస్తులు ధరించాలి. కళ్లకు కూలింగ్ గ్లాస్ తప్పనిసరి.