Weather Alert: చంపేస్తోన్న చలి పులి.. జాగ్రత్త బాసూ!
Weather Alert for Telugu States: సాధారణంగా చలికాలంలో చలి ఒక రేంజ్ లో ఉంటుంది, ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా సాధారణ ప్రజలు ఇష్టపడరు. అయితే ఈ జనవరి 2023లో మరింత పెరిగిపోతోంది. మరీ దారుణంగా నిన్నటి నుంచి టెంపరేచర్లు బాగా డ్రాప్ అవుతున్నాయి. అయితే మునుపటి కంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం. నార్త్ ఇండియాలో వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్లే మన తెలుగు రాష్ట్రాలలో కూడా చలి పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దానికి తోడు బంగాళాఖాతంలో చల్లని వాతావరణం ఉందని దాని వలన అక్కడక్కడా వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
అలాగే 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే చాలా ప్రాంతాలలో 10 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో సైతం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కొన్ని ప్రాంతాల్లో 0°లకు సైతం ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం, భద్రాద్రి వంటి అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న జిల్లాలో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే దాదాపు 0° ల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ శివారు ప్రాంతాలు, నాగర్కర్నూలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలలో కూడా చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. సో ఇలాంటి సమయంలో ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకండి, ఎందుకంటే పొగమంచు వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.