HCA: అజారుద్దీన్ ఓ నియంత.. హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్
HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌పై హెచ్‌సీఏ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశారు. అజర్ ఓ నియంత అని మండిపడ్డారు. అజర్‌కు ఎలాంటి అర్హత లేకపోయినా.. అన్నింట్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు. కోర్టు ఆదేశాల ప్రకారం చెక్‌లపై నేను సంతకాలు చేయాలి. కానీ వారి అవసరాలకు తగ్గట్లు బలవంతంగా నాతో సంతకాలు పెటించుకుంటున్నట్లు తెలిపారు.
భారత్, న్యూజిలాండ్ వన్డే టిక్కెట్ల అమ్మకాల విషయంలోనూ గోల్‌మాల్ చేసినట్లు తెలుస్తున్నది. ఓవైపు ఆన్‌లైన్‌లో అభిమానులకు టికెట్లు అందుబాటులో ఉంచామని చెప్పినా.. వేల టిక్కెట్లు ఎప్పుడు అమ్ముడుపోయాయో తెలియని స్థితి నెలకొంది అన్నారు. రూ.850 నుంచి 20,650 వరకు టిక్కెట్ల ధరలను నిర్ణయించగా, దశలవారీగా ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇదిలా ఉంటే దాదాపు తొమ్మిది వేల కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నాయన్న అధ్యక్షుడు అజర్ అవి ఎవరికి కేటాయించారో చెప్పకపోగా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.
మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారని, ఆన్‌లైన్ టికెట్లలో కూడా గోల్‌మాల్ జరిగిందని, తనతో పాటు ప్యానెల్ మొత్తాన్ని పక్కనపెట్టారని విజయ్ ఆనంద్ ఆరోపించారు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉన్నాయన్న విజయ్ ఆనంద్.. తనను లెక్క చేయకుండా అజారుద్దీన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందే హెచ్‌సీఏలో విభేదాలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు.