Vasanta panchami Celebrations in Basara: బాసరలో ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి వేడుకలు
Vasanta panchami Celebrations in Basara: తెలంగాణలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుండి ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. రిపబ్లిక్ డే, వసంత పంచమి రెండు కూడా ఒకే రోజు కావడంతో ఒకవైపు జాతీయతా భావం, మరోవైపు ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది. ఇక తెలంగాణలో సరస్వతి అమ్మవారి కొలువైన బాసరలో ఈ వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవతో ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామునుండే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో ఉన్నారు. ఆలయంలో తెల్లవారుజాము నుండే అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభం అయింది.
వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రెండు నుండి ఐదేళ్ల వరకు ఉండే చిన్నారులకు ఆలయంలో అక్షరాభ్యాసం చేయిస్తారు. చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే వారి చదువు చక్కగా సాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువును పూర్తి చేస్తారని భక్తుల నమ్మకం, విశ్వాసం. బాసరతో పాటు రాష్ట్రంలోని ఇతర అమ్మవారి దేవాలయాల్లో కూడా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.