Vande Bharat Express: వారంలో 6 రోజులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్
Vande Bharat Express: రైల్వే శాఖ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ పరుగులు తీయటానికి సిద్దమైంది. సంక్రాంతి నాడు ఈ నెల15న ప్రధాని మోదీ వందేభారత్ ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వందేభారత్ రైలు ఇప్పటికే సికింద్రాబాద్ చేరుకుంది. 15వ తేదీన ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆదివారం మినహా వారంలో 6 రోజులపాటు పరుగులు పెట్టనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం మినహా వారంలో 6 రోజులపాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుందని అన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే నిలుపుతారని రైల్వే అధికారులు తెలిపారు.