YS Sharmila: అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం..ఆసుపత్రికి తరలింపు
YS Sharmila: వైతెపా అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమ నాయకులను వదిలిపెట్టి పాదయాత్రకు అనుమతివ్వాలని షర్మిల భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో షర్మిల ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు లోటస్ పాండ్ లో కొనసాగింది. నిరాహార దీక్షలో ఉన్న షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. బ్లడ్ టెస్ట్ చేసిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ షర్మిల ఆరోగ్యంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. షర్మిల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుందని, ఇలాగే కొనసాగితే దీని ప్రభావం కిడ్నీలపై పడుతుందని ఆ తర్వాత ప్రాణానికే ముప్పుతుందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఆమరణ దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లోటస్ పాండ్‌కు చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని అంతకుముందు షర్మిల తేల్చి చెప్పారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారానికి కూడా విడుదల చేయలేదని, పాత కేసులు తవ్వి వారిని రిమాండ్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.