TS Govt on BC Schemes: బీసీల పేరుతో ప్రభుత్వం కొత్త నాటకం మొదలు పెట్టింది. ప్రభుత్వం బీసీ, ఎంబీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. నాలుగేళ్ల నుంచి ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కులవృత్తులకు సాయం అనే కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సాయం కోసం తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమయంలో బీసీల్లో కులవృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష సాయం అందిస్తాం అంటూ కొత్త ప్రకటన చేసింది. ఇదంతా ఎన్నికల స్టంట్ గానే కనిపిస్తోంది. బీసీలను మభ్యపెట్టే ప్రయత్నమని స్పష్టమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సిద్దం అవుతోంది. మరోసారి బీసీ ఓటింగ్ ను టార్గెట్ చేసింది. ఇందు కోసం బీసీల్లో కులవృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష సాయం అందిస్తాం అంటూ ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రూ 2,139 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం నిజంగా అమలు చేసినా లక్ష రూపాయల సాయంతో చేతి వృత్తుల కోసం అవసరమైన పరికరాలు కూడా రావనే అభిప్రాయ ఉంది. వచ్చే ఎన్నికల కోసం బీసీ, ఎంబీసీలను ఓటు బ్యాంకుగా ప్రభుత్వం భావిస్తోంది. దళిత బంధు తరహాలో బీసీ బందు కూడా ఉంటుందనే లీకులు ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల వేళ ఆ డిమాండ్ ఊపందుకుంటోంది.
ప్రభుత్వం ఈ ప్రకటన చేయటం ద్వారా గత తొమ్మిదేళ్ల కాలంగా బీసీలకు ప్రభుత్వం ఏం చేసందనే వాదన తెర మీదకు వచ్చింది. 2018లో రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు తమ స్వయం ఉపాధికోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 9 లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కదరఖాస్తుదారుకూ రుణమివ్వలేదు. 2014–15లో స్వయం ఉపాధి రుణాల కోసం 3.60 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో కేవలం 40 వేల మందికి మాత్రమే రూ.50 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందించింది. ఆ తరువాత ఇప్పటిదాకా మళ్లీ వాటి ఊసే ఎత్తలేదు. పెండింగ్ దరఖాస్తుల గురించి నిర్ణయం తీసుకోకుండానే ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రకటించింది. దీనికి సబంధించి అమలు కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ సమయంలో అయినా లక్షలాది మంది చేసుకున్న దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుందా లేదా అనే ఆందోళన కనిపిస్తోంది.
అత్యంత వెనకబడిన తరగతుల (ఎంబీసీ) అభివృద్ధి సంస్థ ద్వారా బీసీలకు వివిధ కేటగిరీల్లో ఆర్థిక సాయం చేయాలని సర్కారు నిర్ణయించినా.. ఆ మేర నిధులను మాత్రం కేటాయించలేదు. 80 శాతం సబ్సిడీతో కావాల్సిన యూనిట్లకు రూ.50 వేలు అందజేయాలని, 60 శాతం రాయితీతో ట్రాక్టర్, కారు, తదితర వాటిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందించాలని నిర్ణయించినా అమలు కాలేదు. ఇప్పటి వరకు రూ 351 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పైగా ఈ తొమ్మిదేళ్లలో ఈ వర్గాల కోసం రూ.2,139 కోట్లను మాత్రమే కేటాయించింది. 2014–15 నుంచి 2018–19 వరకు వివిధ సమాఖ్యలకు రూ.448 కోట్లను విడుదల చేయగా, ఇందులో కేవలం రూ.230 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. 2019–20 నుంచి ఫెడరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయం వరకు బీసీ జాబితాలో 112 కులాలు ఉండేవి. అదనంగా మరో 16 కులాలను అందులో చేర్చింది. దీంతో బీసీ కులాల సంఖ్య 128కి చేరింది. కులాల వారీగా సమాఖ్యలను ఏర్పాటు చేసింది. ట్లో నిధులు మాత్రం నామమాత్రంగానే కేటాయించింది. 2019–20 నుంచి అయితే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.బీసీ శాఖ వద్ద ఉన్న 9 లక్షల దరఖాస్తుల్లో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయం అందించాలన్నా.. రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బీసీల కోసం సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా..అదీ అమలు కాలేదు. తాజాగా ఫెడరేషన్ల వారీగా రుణాలు అందించేందుకు రూ.650 కోట్ల వరకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
ప్రభుత్వం బీసీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు పైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేస్తున్నారని… గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించారనే విమర్శలు ఉన్నాయి. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ఇప్పుడు వంచనకు తెర లేపారని ఆరోపిస్తున్నాయి. ఫీజు రీ యంబర్స్ మెంట్ విషయంలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణ లు ఉన్నాయి. ఎంబీసీ కార్పోరేషన్ కు నిధులు కేటాయింపులోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్, బీజేపీ బీసీలకు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. బీసీల ఆత్మగౌరవ భవనాల గురించి ప్రకటనలు చేసినా పునాదులు దాటలేదు. ఇప్పుడు తాజా స్కీం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఎటువంటి సిఫార్సులు చేస్తుందో చూడాలి. ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.