Liquor Scam: నేడు సీబీఐ కవిత విచారణ – ఉత్కంఠ
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నేడు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మద్యం కుంభకోణం కేసు సీబీఐ దర్యాప్తులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఎమ్మెల్సీ కవితను బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో విచారించి ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అవసరమైన వివరాలు రాబట్టనున్నారు. ఢిల్లీ నుంచి సీబీఐ ప్రత్యేక బృందం శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శనివారం కవిత మరోసారి కేసీఆర్‌ను కలుసుకున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకోనున్నారు. 11 గంటలకు అధికారులు రానున్న నేపథ్యంలో ఆమె నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ కేసులో కవిత ను డిసెంబరు 6నే ప్రశ్నించాల్సి ఉంది. ఆ రోజు విచారణకు అందుబాటులో ఉండలేనని డిసెంబరు 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని వాటిల్లో ఏదో ఒక రోజు రావచ్చని కవిత ఢిల్లీ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. కవిత లేఖకు స్పందించిన అధికారులు డిసెంబరు 11న ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసానికి వస్తామని ఈ-మెయిల్‌లో బదులిచ్చారు. ఇక విచారణ సమయంలో కార్యకర్తలు,అభిమానులు ఎవరూ తమ నివాసం వైపు రావద్దని కవిత సూచించారు.