Hyderabad: నేడే టీ- వర్క్స్ ప్రారంభోత్సవం
Hyderabad: ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరానికి ప్రాముఖ్యత క్రమంగా పెరుగుతోంది. విశ్వ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ఒడిఒడిగా వేస్తున్న అడుగులు అభివృద్ధిని క్రమంగా పెంచుతున్నాయి. ఇప్పటికే ఐటీ సేవలు, ఫార్మా, టెక్స్‌టైల్స్, తయారీ, రియల్టీ, స్టార్టప్స్, ఆటో రంగాలు మంచి పనితీరును కనబరుస్తున్నాయి..ఈ జాబితాలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
వినూత్న ఆవిష్కరణలు చేసే ఔత్సాహికులకు ఓ వేదికను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ-వర్క్స్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రాయదుర్గంలో 78 వేల చదరపు అడుగులలో నిర్మించిన టి -వర్స్క్ భవనాన్ని నేడు ఫాక్స్‌కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ చేతుల మీదుగా ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. మల్టీమీడియా రంగంలో ఆవిష్కరణల కోసం ఇమేజ్ టవర్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. టీహబ్ రెండో విడతలో 4.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయం, ఇమేజ్ టవర్‌లో 16 లక్షల చదరపు అడుగుల వర్క్‌ప్లేస్ అందుబాటులోకి వస్తాయన్నారు.
దేశంలో తయారీదారులు, ఆవిష్కర్తల సంస్కృతిని సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసిందని అన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచే డిజైన్ థింకింగ్ అలవర్చుకోవాలని, మేధస్సుకు పదును పెడితే మంచి ఆలోచనలు వస్తాయని సూచించారు. టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదని, పట్టణాల నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆవిష్కర్తలను గుర్తించి వారిని ఇక్కడికి తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.