Secunderabad Fire Accident: చూసోస్తామని వెళ్లిన యువకుల ఆచూకీ గల్లంతు
Secunderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దక్కన్ మాల్‌లో హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఆరు అంతస్తుల భవనం, రద్దీగా ఉండే ప్రాంతంలోని ఈ మాల్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. వెంటనే ఫైర్ ఇంజన్లు రంగప్రవేశం చేశాయి. ఈ భవనంలోని క్రింది అంతస్తులో కార్ డెకార్, పై అంతస్థుల్లో దక్కన్ యూనిఫాం, దక్కన్ స్పోర్ట్స్‌వేర్ వస్త్రదుకాణాలు ఉన్నాయి. అయితే, క్రింది సెల్లార్‌లోని కార్ డెకార్‌లో మొదలైన మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. మొదట కేవలం పొగలు మాత్రమే రావడంతో అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఆ తరువాత మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో సుమారు 40 ఫైర్ ఇంజిన్లు 9 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.
ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఉన్న భవనాల్లోని వారిని ఖాళీ చేయించారు. కాగా, అప్పటికే భవనం లోపల పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే, లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూసొస్తామని చెప్పి వసీం, జాఫర్, జునైద్ అనే యువకులు భవనం లోపలికి వెళ్లారు. వద్దని వారిస్తున్నా వినకుండా లోపలికి వెళ్లిన యువకులు ఎంతకీ బయటకు రాకపోవడంతో పాటు, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో వారంతా మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినా, లోపల గోడలు వేడిగా ఉండటంతో పాటు సీలింగ్ పెచ్చులు ఊడిపడుతుండటంతో లోనికి వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. ముగ్గురి యువకులపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.