Rain Alert:హైదరాబాద్‌లో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్
Rains For Another Three Days: గ్రేటర్ హైదరాబాద్‌లో మరో సారి భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. శుక్రవారం మోస్తరుతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నిన్న చాదర్ ఘాట్‌ను, మూసారంబాగ్ బ్రిడ్జిని ముంచేసిన మూసీ ఇవాళ కాస్త శాంతించింది. మూసీకి వరద ప్రవాహం తగ్గడంతో ఇళ్లలోకి చేరిన బురదను స్థానికులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం మూసారంబాగ్ బ్రిడ్జిని ఆనుకోని వరద వెళ్తోంది. ఇలాంటి సమయంలో భారీ వర్షం కురుస్తే మళ్లీ బ్రిడ్జి మునిగే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక నివాసాల్లోకి సైతం వరద నీరు వెళ్లే అవకాశం అధికంగా ఉంది.
మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది.