మే నెలలో భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేడికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనాలు మరోదారిలేక ఇంట్లోనే తలదాల్చుకుంటున్నారు. బయటకు రావాలంటే బాబోయ్ అంటున్నారు.
Temperature in Telugu States: మే నెలలో భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేడికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాల్చడంతో జనాలు మరోదారిలేక ఇంట్లోనే తలదాల్చుకుంటున్నారు. బయటకు రావాలంటే బాబోయ్ అంటున్నారు. 10 గంటలు దాటితే నెత్తి మాడుతోంది. నడినెత్తికి వచ్చినపుడు ఎండ ఏవిధంగా ఉంటుందో ఆవిధంగా ఉంటున్నది. ఈ పరిస్థితులు మరో నాలుగైదు రోజులు ఉంటాయని చెబుతూనే, రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తున్నది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఐఎండీ తెలియజేసింది.
భారీ ఉష్ణోగ్రతలు…
రాష్ట్రంలో గురువారం రోజున కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. నల్గొండ జిల్లా నిడమానూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్ర నమోదవ్వగా, కరీంనగర్ జిల్లాలోని తంగులలో 45.6 డిగ్రీలు, నల్గొండ జిల్లా దామచర్లలో 45.5 డిగ్రీలు, కరీంనగర్ జిల్లాలోని వీణవంక, సూర్యాపేట జిల్లాలోని రాయినిగూడెంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదవ్వగా, హైదరాబాద్లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో 40.8 డిగ్రీలు, హనుమకొండలో 41 డిగ్రీలు, ఆదిలాబాద్లో 41.3 డిగ్రీలు, భద్రాచలంలో 42.8 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 40.8 డిగ్రీలు, నిజామాబాద్లో 40.9 డిగ్రీలు, రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఎండలు భారీగా నమోదవుతున్నాయి. గుంటూరు, ఏలూరు, రాజమండ్రిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
వర్షాలు కురిసే అవకాశం
ఎండలు మండిపోతున్న తరుణంలో వాతావరణ శాఖ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే, వర్షాలు కురిసిన తరువాత వాతావరణంలో వేడి పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఎండల తీవ్రత పెరుగుతందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోరే రెండు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. రాష్ట్రానికి వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.
నేడు వాతావరణం…
వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణంలో వేడి పెరుగుతున్నది. ఈరోజు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. గరిష్టంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చు. ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఎల్ నినో ప్రభావం చేత ఎండలు మండిపోయే అవకాశం ఉంది. వాయువ్య ప్రాంతం నుంచి గాలులు, ఇసుక గాలులు వీస్తున్నాయి. దీంతో వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడంతో ఉక్కపోతలు పెరిగినట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో ఇలా…
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగనుంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలియజేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలియజేశారు. రేపు 29 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో 5 మండలాలు, గుంటూరు జిల్లాలో ఒక మండలం, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడు జిల్లాలో 2, మన్యం జిల్లాలో 5, విజయనగరం జిల్లాలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.