Telangana Teachers MLC Elections: తెలంగాణలో కమలం జోష్
Telangana Teachers MLC Elections: ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ తరపున ఏవీఎన్ రెడ్డి బరిలో దిగగా, పీఆర్టీయూటీఎస్ తరపున గుర్రం చెన్నకేశవరెడ్డి పోటీలో నిలిచారు. అయితే, గురువారం రోజున ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గురువారం అర్థరాత్రి వరకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగింది. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడంతో పాటు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓట్ల పరంగా కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాధాన్యత ఓట్లను అనుసరించి అభ్యర్థుల విజయం ఉంటుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి 1150 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
ఈ ఎన్నికల కౌంటింగ్ సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగింది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభంకాగా, సాయంత్రం 5 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో అభ్యర్థి విజయం సాధించాలంటే మెజార్టీ 50 శాతం రావాలి. కానీ, ఎవరికీ ఈ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం కావడంతో లెక్కించడం మొదలుపెట్టారు. అయితే, రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఎవరికి మెజారిటీ రాలేదు. దీంతో మూడో స్థానంలో నిలిచిన టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌కు వచ్చిన 6079 ఓట్లను మొదటి రెండు స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఏవీఎస్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డిలకు పంచారు. దీంతో ఏవీఎస్ రెడ్డి విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేయగా, 452 ఓట్లు చెల్లకపోవడం విశేషం.
ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి బీజేపీ ఘన స్వాగతం పలికింది. బీజేపీ రాష్ట్రకార్యాలయం వద్ద ఎవీఎన్ రెడ్డికి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యకర్తలు నేతలు గెలిచిన ఏవీఎన్ రెడ్డిని భుజాలపై ఎక్కించుకొని ఊరేగింపుగా కార్యాలయంలోకి తీసుకెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు, కార్యకర్తలు తనకు అండగా నిలవడం, ప్రచారం చేయడంతోనే తాను విజయం సాధించానని తెలిపాడు. టీచర్స్ ఎమ్మెల్సీగా తన విధులను నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇదే జోష్‌ను అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని నిర్ణయించారు.
కార్యకర్తల్లో జోష్ నింపేందుకు నేతలు పూనుకోవాలని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బండి సంజయ్ కోరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేని, తెలంగాణలో పాగా వేసేందుకు ఇదే మంచి తరుణమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ కైవశం చేసుకున్నది. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉండటంతో విజయం సాధ్యమైంది. అయితే, టీచర్స్ కోటాలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ జరగడంతో బీఆర్ఎస్ పార్టీకి షాకిస్తూ కాషాయం విజయం సాధించింది. ఈ విజయం కమలం నేతల్లో జోష్ పెంచింది. సెబీస్ ఎన్నికలుగా భావించగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో వచ్చే ఎన్నికలపై కమలనాధులు దృష్టి సారించారు.