TS Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
TS Cabinet: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరగనుంది. ఒకవేళ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే తీసుకోవలసిన చర్యలపై మంత్రి వర్గంలో చర్చించనున్నారు. కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని అన్నారని సమాచారం.
దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో అమలు అలాగే గిరిజన బంధు పైన కూడా చర్చించనున్నారు. సొంత ఇల్లు ఉండి నిర్మించుకునే వారికి మూడు లక్షల ఆర్థిక సాయం అందించే పథకంపై కూడా మంత్రి వర్గంలో చర్చించనున్నారు. ఈ పధకానికి సంబంధించి విధివిధానాలపై మంత్రులతో చర్చించనున్నారు. ఇళ్ల స్థలాల కోసం పట్టాల పంపిణీ కార్యక్రమం,అలాగే జీవో 59పై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.