Revanth Reddy on Congress Senior Leaders: కాంగ్రెస్ సీనియర్లపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Congress Senior Leaders: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది సీనియర్ నేతలు సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోయారని అన్నారు. ఈ నాయకుల వలన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. అయితే, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ఉండనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా చేరికలను ఆపేది లేదని అన్నారు. డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని, అయితే అది అధిష్టానం ఇష్టం మేరకు ఆధారపడి ఉంటుందని రేవంత్ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 32 నుండి 35 శాతం మేర ఓటింగ్ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయని, తప్పకుండా ఈ ఓటింగ్ శాతం మరింతగా పెంచుకుంటామని అన్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బీఆర్ఎస్ ను సరిగా పట్టించుకోవడం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 150కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేపట్టబోయే యాత్రలో తానుకూడా పాల్గొంటానని అన్నారు.