Vanpic Projects Case : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court crucial orders on Vanpic Projects : వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదని హైకోర్టు తేల్చేసింది. వైఎస్ హయాంలో ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు భూముల కేటాయింపు జరిగింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూముల కేటాయింపుపై కేసు నమోదు చేసిన సీబీఐ హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ ఛార్జ్‌షీట్ చెల్లదంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. తాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు భారీ ఊరట లభించిందని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రధాన కేసు. ఈ ప్రాజెక్టు ప్రమోటర్లలో ఒకరైన నిమ్మగడ్డ ప్రసాద్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఈ ఛార్జ్‌షీట్‌కు సంబంధించి నిందితులుగా ఉన్న వారందరికీ ఒకరకంగా ఈ తీర్పుతో పరోక్షంగా ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ తదుపరి చర్యలేవైనా ఉంటాయా? సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా ? ఇంకా అన్నది తేలాల్సి ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేసే నిమిత్తం 2008లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చేసిన భూకేటాయింపులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ గతంలో సీబీఐ ఈ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కూడా ప్రధాన నిందితుడు. ఈ కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు సీబీఐ అధికారులు. దీన్ని సవాలు చేస్తూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు ఈ పిటిషన్‌పైనే కోర్టు తీర్పు వెల్లడించింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ చెల్లదంటూ తీర్పు చెప్పింది.
హైకోర్టు తాజా తీర్పుతో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధి చేయతలపెట్టిన ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఇప్పటి దాకా ఎదురైన న్యాయపరమైన అడ్డంకి చాలా వరకూ తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసుపై దాదాపు పది సంవత్సరాలుగా న్యాయపరంగా పోరాడుతున్నారు నిమ్మగడ్డ ప్రసాద్.