Tamilisai key comments on Telangana Ministers: మహిళల కోసమే పనిచేస్తున్నా…తిట్టిన వారికి రివార్డులిస్తున్నారు
Tamilisai key comments on Telangana Ministers: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ తెలంగాణ ప్రభుత్వం, మంత్రులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాను మహిళా మంత్రులు, మేయర్‌లు, అధికారులకు ఆహ్వానాలు పంపామని, తాను ఆహ్వానం పంపినా చాలా మంది హాజరు కాలేదని అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారికి గవర్నర్ ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణలో ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం మహిళా దర్బార్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ దర్బార్ ద్వారా 1000కి పైగా ధరఖాస్తులు వచ్చాయని అన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
తెలంగాణలో ఎంతో టాలెంట్ ఉన్న మహిళలు వివిధ రకాల కారణాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి లాంటి అమ్మాయిని పోగొట్టుకున్నామని అన్నారు. తాను అవమానాలు పాలైన మహిళల కోసం పని చేస్తూనే ఉంటానని, వారికి బంగారు భవిష్యత్తును కల్పించడమే తన విధి అని అన్నారు. తనను తిట్టినవారికి శిక్ష వేయకుండా, తనను తిట్టినందుకు రివార్డులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికోసమో కాంప్రమైజ్ కాకుండా పనిచేయాలని అన్నారు. తనను బాధపెట్టేవిధంగా అనేక మంది ప్రవర్తిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను తెలంగాణ ప్రజల కోసం నిలబడతానని గవర్నర్ తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా గవర్నరైన తనను తీవ్రంగా విమర్శిస్తున్నారని, ఎన్ని విమర్శలు చేసినా తాను నిలబడి పనిచేస్తానని అన్నారు.