Telangana government increases the police protection to MLAS including pilot Rohit Reddy: తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి ప్రతినిధులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో నలుగురు ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో హాట్ టాపిక్ గా మారారు. పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బిజెపికి అమ్ముడుపోతున్నట్లుగా నటించి చివరి నిమిషంలో పోలీసులకు బిజెపి ప్రతినిధులను పట్టించినట్లుగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ విషయంలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతానికి రిమాండ్ కి కూడా తరలించారు. ఈ నేపథ్యంలో బిజెపికి అమ్ముడు పోవడానికి ప్రయత్నించినట్లు నాటకం ఆడి ఎదురు తిరిగిన నలుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భద్రత పెంచింది.
ఇప్పటికే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి ముగ్గురికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ కూడా వారికి కల్పించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఎస్కార్ట్ వాహనాలు అలాగే పోలీసులు కూడా సదరు ఎమ్మెల్యేలను రిపోర్ట్ చేసి డ్యూటీలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం మీద బండి సంజయ్ బిజెపి ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మీడియాకు ఈ మేరకు సమాచారం కూడా అందింది. కెసిఆర్ ఒక పెద్ద తెర ఏర్పాటు చేసి ఎలా అయితే వీడియోలను ప్రొజెక్ట్ చేశారో బండి సంజయ్ కూడా పెద్ద తెర ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దానిపై ఏం ప్రొజెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.