Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల లొల్లి
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు కొత్తగా పార్టీలో చేరిన వారికి మధ్య రగడ జరుగుతున్నది. అంతర్గతంగా ఉన్న ఈ లొల్లి ఇప్పుడు రచ్చకెక్కాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో పేరుతో పాదయాత్రను నిర్వహించారు. కాగా, తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు వారి నియోజకవర్గాల్లో, వారి జిల్లాల్లో పాదయాత్రలు చేసేందుకు సిద్దమౌతున్నారు. భట్టి విక్రమార్క తన జిల్లాలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆయనకు అనుకూలంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదం కదపనున్నారు. అయితే, మరో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి తన నియోజక వర్గంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యంరావ్ ఠాక్రే అడ్డుకున్నారు. పాదయాత్ర చేసేందుకు పార్టీ అనుమతి లేదని లేఖ రాశారు. దీంతో మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను నిలిపివేశాడు. తన పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌పై విరుచుకుపడ్డారు. ఇన్‌చార్జ్ హోదాలు తన పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే తాను పాదయాత్ర చేయాలని అనుకున్నానని, పాదయాత్రను అడ్డుకోవడం వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా విమర్శించారు.
గ్రూపు తగాదాలు మరోసారి బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ అవి బయటపడకుండా చూసుకోవాలని ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు నేతలంతా కలిసి ఒక్కటిగా ముందుకు సాగాలని అధిష్టానం ఆదేశించింది. అయితే, పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నేతలను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో ఈ లొల్లి మొదలైంది.
వేరే పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చి, ఆ వెంటనే పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకొని పగ్గాలు చేపట్టడం చాలా మంది సీనియర్ నేతలకు నచ్చలేదు. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఒకానొక దశలో నేతలు పూర్తిగా వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి మొండి పట్టుదలతో పట్టువదలకుండా ముందుకు నడిచాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మార్పు తరువాత సీనియర్, జూనియర్ నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో అంతా సర్ధుకుందని అనుకున్నారు.
కానీ, పాదయాత్ర విషయానికి వచ్చేసరికి రేవంత్ తో పాటు పార్టీ నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తామని ముందుకు వచ్చే సరికి అధిష్టానం షాకయ్యింది. వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. పార్టీ అనుమతి ఇచ్చినవారు మాత్రమే పాదయాత్రలు చేయాలని ఆదేశించడంతో లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది.