CM Kcr: ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన.. సీఎం కేసీఆర్
CM Kcr: తెలంగాణ సీఎం , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోళీ పండుగ స్వాగతం పలుకుతుందని సిఎం కేసీఆర్ అన్నారు. చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోళీరూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనదన్నారు. మానవ జీవితమే ఒక వేడుక అనే భావనను, ప్రకృతితో మమేకమై జీవించాలనే తత్వాన్ని మనకందిస్తుందన్నారు. బేధభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ సహజసిద్దమైన రంగులతో హోళీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం సూచించారు.
హోలీ వసంత కాలంలో వస్తుంది. ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ ( వసంతోత్సవ పండుగ ) అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా మారుతాయి.