ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం ప్రారంభం అయింది. మే 2 నుండి కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వం పరిపాలనను నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు కేబినెట్ మీటింగ్‌లను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహిస్తూ వచ్చారు. కాగా, ఈసారి జరిగే కేబినెట్ మీటింగ్ కొత్త సచివాలంలో జరగనున్నది.
Telangana Cabint Meeting: ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయం ప్రారంభం అయ్యాక తొలి కేబినెట్ భేటీ ఇవ్వాళ జరగనుంది.. మే 2 నుండి కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వం పరిపాలనను నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు కేబినెట్ మీటింగ్‌లను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహిస్తూ వచ్చారు. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు, కీలక అధికారులు పాల్గొననున్నారు. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఈ సమావేశం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు.
కాగా, ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై సమీక్షించే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దకాలం కావొస్తుండటంతో జూన్ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్రంలో ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు హైదరాబాద్ నుంచి మొదలై రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కీలక అంశాలపై
ఈనెల 27వ తేదీతో ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీకాలం ముగియనున్నది. వీరు గవర్నర్ కోటాలో గతంలో నియమింపబడిన ఎమ్మెల్సీలు. వీరి స్థానంలో ఎవర్ని రిఫర్ చేయాలి అనే దానిపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను కూడా సమావేశంలోనే ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఖరారైన అభ్యర్థుల పేర్లను గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది.
అదేవిధంగా, గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లులలో రెండింటిని గవర్నర్ వెనక్కి పంపారు. వెనక్కి పంపిన బిల్లులపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఈ రెండు బిల్లులపై చర్చించి, అవసరమైతే వాటిని మళ్లీ గవర్నర్ ఆమోదం కోసం పంపేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఒకవేళ బిల్లులను మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపాలని అనుకుంటే, మరోసారి అసెంబ్లీని హాజరుపరచాల్సి ఉంటుంది. బిల్లుల్లో అవసరమైతే మార్పులు చేయాలని, ఎలాంటి మార్పులు చేయాలో కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ప్రధాన అజెండా
ఈ ఏడాది తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. మరో నాలుగైదు నెలల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా, కర్ణాటక ఎన్నికల సరళిపైనా, అక్కడి పార్టీలు అనుసరించిన వ్యూహాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధం కావడానికి తీసుకోవలసిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకునే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలన సమాచారం. ఈసారి కూడా ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అయితే, పవనాలు అందుకు కొంత భిన్నంగా ఉండటంతో, వాటికి చెక్ పెట్టాలని కూడా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి పనితీరు, రాబోయే రోజుల్లో తీసుకురావల్సిన పథకాలు వాటి అమలుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
దీంతో పాటు పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. మరికొన్ని చోట్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంపిణీ మార్గదర్శకాలపై ప్రభుత్వం ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ తేదీలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.