Robots: పాఠాలు చెబుతున్న రోబోలు.. ఎక్కడో తెలుసా ?
Robots Teaching: సమాజం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. మారుతున్న సమాజానికి అనుగూణంగా బోధనలో కూడా మార్పులు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకు బదులు రోబోలు పాఠాలు చెబుతున్నాయి. నగర సమీపంలోని శంకర్ పల్లి మండల పరిధిలో గల మోకిల వద్ద ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో రోబోలు పాఠాలు చెప్పడం ప్రారంభించాయి. ఉపాధ్యాయుల వలే పిల్లలకు అర్ధమయ్యే విధంగా పాఠాలు చెబుతున్నాయి.
ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం రోబోలు బెంగళూరులో పాఠాలు చెప్పే పద్దతికి శ్రీకారం చుట్టినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. గతంలో 1.0 మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపిన యాజమాన్యం.. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పాఠాలు చెబుతున్న ఈ రోబోలు 5.0 మోడల్‌తో బోధనను ప్రారంభించినట్లు తెలిపింది. నగరంలో “ఈగల్” పేరిట ఏడు రోబోలు 5వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు పాఠాలు చెబుతున్నాయని, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెబుతాయని యాజమాన్యం పేర్కొంది. మరోవైపు రోబోలు కేవలం బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల ఏకాగ్రతపైనా కన్నేసి ఉంచగలవని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి అమర్చిన ప్రత్యేక కెమెరాల సాయంతో ప్రతి విద్యార్థి శ్రద్ధతో వింటున్నారో.. లేదో గుర్తిస్తుందన్నారు. ఎవరైనా సరిగా లేకపోతే సదరు విద్యార్థిని అప్రమత్తం చేస్తుందని తెలిపారు.