TDP chief Chandrababu appoints kasani gnaneshwar mudiraj as ttdp president: ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరో పక్క తెలంగాణ తెలుగుదేశం మీద కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతానికి హైదరాబాదులోనే ఉంటూ అడపాదడపా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్న చంద్రబాబు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఎల్ రమణను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
అయితే ఎల్ రమణ ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన స్థానంలో బక్కని నరసింహులు అనే ఒక బీసీ నేతకు అవకాశం కల్పించారు. అయితే ఆయనకు అంత చరిష్మా లేకపోవడం, ఆర్థిక వనరులు కూడా బలంగా లేకపోవడంతో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీని పటిష్ట పరచడంలో విఫలమయ్యారు అనే చెప్పాలి. ఈ నేపద్యంలోనే చంద్రబాబు నాయుడు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ తెలుగుదేశం పార్టీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును ఒప్పించి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ఈ మధ్యనే చంద్రబాబు సమక్షంలో మళ్లీ పసుపు కండువా కప్పుకున్నారు.
తాజాగా ఆయనను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేతగా నియమిస్తూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరో పక్క ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న బక్కని నరసింహులును తీసుకుంటున్నామని అదే విధంగా ఆయనని జాతీయ కార్యదర్శిగా కూడా నియమిస్తున్నామని చంద్రబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బిజెపి బలపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అనేక సంచలన విషయాలకు కూడా కారణమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏ మేరకు తెలంగాణలో బలపడుతుందో వేచి చూడాలి.