Tarun Chugh Fires on BRS: మాఫియాకు కేరాఫ్ బీఆర్ఎస్
Tarun Chugh Fires on BRS: మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీపై పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ కోసమే ఆవిర్భవించినట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్, ఇప్పుడు పార్టీ నుండి తెలంగాణ పదాన్ని తొలగించి ప్రజలను మరోసారి వంచించారని రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయి పార్టీ కాదని, ఆ పార్టీకి మధ్యలోనే మునిగిపోయే నావ అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు చేశారని, కానీ, దాని వలన ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ నేతలు మాఫియాకు అడ్డాగా మారుతున్నారని అన్నారు. ధరణి పేరుతో వేల కోట్ల రూపాలయ అవినీతి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటి బాట పట్టిస్తారని అన్నారు.
2014లో రాష్ట్రం ఆవిర్భవించినపుడు 5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్‌గా ఉండగా, ఇప్పుడు ఐదు లక్షల కోట్లు అప్పులయ్యాయని అన్నారు. జీహెచ్ఎంసీ సైతం అప్పుల్లో కూరుకుపోయిందని, అదేవిధంగా పలు కార్పోరేషన్లు సైతం అప్పుల మయంగా మారిపోయాయని విమర్శించారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో దోచుకోవడానికి ఏమీ లేకనే ఇప్పుడు దేశంపై పడ్డారని, రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా ఉండాలని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.