TSPSC: పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ .. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు
T Congress agitation on Paper leak issue
తెలంగాణ పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షలాది మంది విద్యార్ధులు షాక్ తిన్నారు. పోటీ పరీక్షలకు ఎన్నో నెలలుగా ప్రిపేర్ అవుతున్నవారు ప్రస్తుతం ఏం చేయాలో తోచక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీరును ఎండగట్టాలని భావిస్తోంది. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఘాటు విమర్శలు చేశారు.
పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి పెద్ద చేపలను వదిలేశారని రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, బోర్డు మెంబర్లు, కేటీఆర్, కేసీఆర్ తప్పించుకుంటున్నా రని రేవంత్ రెడ్డి విమర్శించారు. పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీకి పంపించిన కేసీఆర్.. పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయండని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేపర్ లీక్ వ్యవహారంపై 22న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆరెస్, బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి సిట్టింగ్ జడ్జి తో, లేదా సీబీఐతో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.