కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీభత్సం నెలకొంది. నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షం కారణంగా పలు చోట్ల నీరు నిలిచినట్లు ఫిర్యాదులు అందాయి.
Underpasses: కర్ణాటక రాజధాని బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీభత్సం నెలకొంది. నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షం కారణంగా పలు చోట్ల నీరు నిలిచినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో తుఫాను వర్షం కారణంగా 23 ఏళ్ల మహిళ మరణించగా, ఒక చిన్న పిల్లవాడు తప్పిపోయాడు. ఆ మహిళను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న భాను రేఖగా గుర్తించారు. కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో నీరు చేరడంతో మృతి చెందారు. మృతుడి కారు ఈ అండర్‌పాస్‌లో మునిగిపోయిందని, అందులో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారని చెబుతున్నారు. వీరిలో ఆరుగురు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అయితే, భాను రేఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నీరు ఎక్కువగా మింగడం వల్లే భానురేఖ మృతి చెందినట్లు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ లో అయితే వర్షం పడితే రోడ్లు చెరువులుగా మారడం అనేది సహజమే. ఇక అండర్ పాసుల గురించి చెప్పనక్కర్లేదు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన మహానగరంలో మరి ఎందుకు ఇప్పటికీ ఈ పరిస్థితులు నెలకొన్నాయంటే సమాధానం లేని ప్రశ్నగానే ఉండిపోతోంది. ప్రతీసంవత్సరం.. లేదంటే వర్షాలు పడినప్పుడు అప్పటికప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మాములే అన్నట్లుగా సమస్యను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రోజురోజుకూ నగరం విస్తరిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ప్రపంచ నగరాలను తలదన్నేలా గట్టి పోటీ ఇస్తోంది. అయినా కూడా చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపడుతూ ట్రాఫిక్ చిక్కు ముడులను విప్పేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వర్షపు నీటి విషయంలో మాత్రం ఘోర వైఫల్యం కనిపిస్తోందని నగరవాసులు అంటున్నారు.
హైదరాబాద్ రోడ్ల గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. కాస్త వర్షం పడింది అంటే లోతట్టు ప్రాంతాలన్నీ నిండిపోతాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో వర్షం పడితే నీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తుంటాయి. రోడ్లన్నీ జలమయం అవుతాయి. ఎక్కడ మాన్ హోల్ తెరిచివుంటుందో అని బిక్కు బిక్కుమంటూ ప్రయాణికులు అడుగు తీసి అడుగులేస్తారు. ఇటీవల హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యేటా ఇలా దిద్దుబాటు చర్యలతోనే సరిపెడుతున్న పాలకులు శాశ్వత పరిష్కారం చూపించడంలో విఫలమయ్యారనేది వాస్తవం. నాలాల విస్తరణ చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. దాని ఫలితాలు మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు. చెరువుల కబ్జాలను తొలిగిస్తామనే హామీలు హామీలుగానే ఉండిపోతున్నాయి.
ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడం కోసం ప్రభుత్వం పలుచోట్ల అండర్ పాసులను ఏర్పాటు చేసింది. ఇది ఒకింత ట్రాఫిక్ ను తగ్గించిన ..వర్షాకాలం వస్తే అండర్ పాస్ అంటే భయపడుతున్నారు. అండర్ పాస్‌ల వద్ద వర్షపు నీరు పోయేమార్గం లేక గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఆ రోడ్డుగుండా వెళితే మృత్యు కుహరంలోకి వెళ్ళినట్టేనని నగరవాసులంటారు. అభివృద్ధి పనుల్లో అధికారులు సరైన ప్రణాళికలు అవలంబించకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ప్రజలు ఎంతలా ఇబ్బందులకు గురవుతారో దీనిని చూస్తే అర్థమవుతుంది. నగరంలో పలుచోట్ల అండర్ పాస్ లు ఏర్పాటు చేసారు. అధికారుల ప్రణాళిక లోపమనాలో ఏమో తెలియదు కానీ అవి వర్షాకాలంలో ప్రజల అవసరాలు తీర్చందిలేదు. చిన్న వర్షం కురిసిన మురుగు, వరద నీరు చేరి రోజుల తరబడి ప్రజల రాకపోకలు నిలిచి పోవడం పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆయా కాలనీవాసులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అండర్ పాస్ లో నిలిచిన నీటిని చుస్తే నదిలా కనిపిస్తుందంటున్నారు నగరవాసులు. ఎల్ బి నగర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, మియాపూర్, రాజీవ్ గృహకల్ప, సురభి కాలనీ, ఆరంభ టౌన్ షిప్ ఇలా సిటీలో ఎన్నో అండర్ పాసులనుండి వాన కాలంలో వెళ్లాలంటే ప్రజలు బిక్కు బిక్కుమంటూ వెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అండర్ పాస్ లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.